జిన్నింగ్‌ మిల్స్ వ్యాపారులు జిమ్మిక్కులు!

జిన్నింగ్‌ మిల్స్ వ్యాపారులు జిమ్మిక్కులు!
November 06 10:44 2017
ఆదిలాబాద్‌,
తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకుని మార్కెట్‌కు తరలించిన రైతన్నలకు కష్టాలు మాత్రం తొలగిపోవడంలేదు. ప్రధానంగా జిన్నింగ్‌ మిల్లుల వ్యాపారులు జిమ్మిక్కులు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మద్దతుధర కంటే ఎక్కువ ఆశచూపి కొద్ది మొత్తంలో పత్తి కొనుగోలు చేస్తున్నారని, మిగిలినది తక్కువ ధరకు కొంటూ రైతన్నలకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందని భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు చేయకుండా నిరాకరించడంతో వ్యాపారుల దోపిడీకి హద్దులేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సీసీఐ కంటే ఎక్కువ ధర ఇస్తున్నామని అధికారులను, ప్రభుత్వాన్ని నమ్మిస్తూ సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 9 చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలను తెరచినా.. తేమ శాతం ఎక్కువగా ఉందని సీసీఐ కొనుగోళ్లకు నిరాసక్తి ప్రదర్శించింది. ఇప్పటి వరకు ఒక్క క్వింటా పత్తి కూడా కొనుగోలు చేయలేదు. అయితే ప్రైవేటు వ్యాపారులు మాత్రం కేవలం ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డులోనే 4లక్షల క్వింటాళ్ల వరకు పత్తికొనుగోలు చేశారు.
ఇప్పటి వరకు కొనుగోలు చేసిన పత్తి వివరాలను పరిశీలిస్తే 25శాతం పత్తికి మాత్రమే కనీస మద్దతు ధర లభించింది. సుమారు 3లక్షల క్వింటాళ్ల పత్తికి కనీస మద్దతు ధర దక్కలేదని రైతన్నలు వాపోతున్నారు. జిన్నింగ్ వ్యాపారులు అతి తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇదిలా ఉంటే 8శాతం తేమ ఉన్న పత్తి పంటకు ప్రతి రోజు మార్కెట్‌లో మద్దతుధర కంటే ఎక్కువ ధరను ప్రకటిస్తున్నారు. ఈ సీజన్‌లో పత్తి కొనుగోళ్లు మొదలైనప్పటి నుంచి కూడా మద్దతుధర కంటే ఎక్కువ ధరనే వ్యాపారులు ప్రకటిస్తున్నారు. ఇలా ఎక్కువ ధరను ప్రకటించే వ్యాపారులు కొనుగోళ్లకు వచ్చేసరికి ప్లేట్ మార్చేస్తున్నారు. ఒకరిద్దరికి మాత్రమే ఆ ధరను ఇస్తూ మిగిలిన పత్తి మొత్తం తేమ ఎక్కువగా ఉందని భారీగా కోత పెడుతున్నారు. ఈ విషయమై సీసీఐ ప్రేక్షకపాత్రకే పరిమితమవడంతో రైతులకు ఆవేదన తప్పడంలేదు. సీసీఐ సిబ్బంది కూడా జిన్నింగ్‌ వ్యాపారుల మాయమాటల్లో పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిన్నింగ్‌ వ్యాపారులే ఎక్కువ ధర ఇస్తున్నారంటూ కొనుగోళ్లను గాలికి వదిలేశారని రైతన్నలు విమర్శిస్తున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మార్కెట్‌యార్డుల్లో వ్యాపారుల మాయాజాలానికి తెరదించాలని రైతులు కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6237
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author