డీలా పడిపొయిన డిజిటల్ కరెన్సీ

 డీలా పడిపొయిన డిజిటల్ కరెన్సీ
November 08 14:08 2017
శ్రీకాకుళం,
నగదు రహిత లావాదేవీల నిర్వహణ ఏడాది తిరిగేకల్లా పూర్తిస్థాయిలో సాధిస్తామని అధికార పార్టీ నాయకులు ప్రారంభంలో చాలా హడావుడి చేశారు. డిజిటల్‌ కరెన్సీ వాడకం సాధ్యాసాధ్యాలపై నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేసినా కొట్టిపారేశారు కూడా. వాస్తవానికి జిల్లాలో నగదురహిత లావాదేవీలు నిర్వహించడానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అంతంత మాత్రమే. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో జన్‌ధన్‌ ఖాతాలు దాదాపు 5.27 లక్షల వరకూ ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం సజీవంగా (కేవైసీ) ఉన్నవి కేవలం 3 లక్షలకు మించిలేవు. అంటే 60 శాతమే. మిగిలినవన్నీ ఉపయోగంలో లేనివే. సాధారణ బ్యాంకు ఖాతాలు జిల్లాలో 25 లక్షల వరకూ ఉన్నాయి. వాటిలో 30 శాతం మంది మొబైల్‌లో బ్యాంకింగ్‌ సేవలు వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నా సాంకేతిక సమస్యల వల్ల ఆ స్థాయిలో కూడా ఉండవనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మొబైల్‌ బ్యాంకింగ్‌కు స్మార్ట్‌ఫోన్‌తో పాటు లావాదేవీలపై అవగాహన ఉన్నవారు సామాజిక, ఆర్థిక, అక్షరాస్యత పరిస్థితుల దృష్ట్యా చూస్తే జిల్లాలో రెండు లక్షలు వరకూ ఉంటే గొప్ప విషయమే. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు, నిరక్షరాస్యులు ఎక్కువ. జన్‌ధన్‌ ఖాతాలు ఎక్కువగా మహిళలకే ఉన్నాయి. నిరక్షరాస్యత వారిలోనే ఎక్కువ. అయితే జిల్లాలో 3,90,771 రూపే కార్డులు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ అవి పెద్దగా ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు.ఎక్కడికక్కడ చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకూ, ఆర్టీసీ, రైలు టిక్కెట్ల నుంచి బిల్లుల చెల్లింపుల వరకూ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషిన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తామని పెద్దనోట్ల మార్పిడి ప్రక్రియ తర్వాత ప్రభుత్వం ఊదరగొట్టింది. కానీ అవెక్కడున్నాయో ప్రస్తుతం కనిపించట్లేదు. తొలుత 891, ఆ తర్వాత మరో 2,500 పీవోఎస్‌ మెషిన్లు అందుబాటులోకి తెచ్చామని అధికారులు చెప్పారే తప్ప అవెప్పుడో మూలకు చేరిపోయాయి. జిల్లాలో బ్యాంకు ఆఫ్‌ బరోడా ద్వారా 480 పీవోఎస్‌ మెషిన్లు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉపయోగించేందుకు తెప్పించామని అధికారులు ప్రకటించినా ఇప్పటివరకూ ఏ ఒక్క బస్సులోనూ వాడిన దాఖలాలు లేవు.జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లోనూ సూపర్‌ మార్కెట్‌లకే స్వైపింగ్‌ మిషన్లు పరిమితమయ్యాయి. కిరాణా దుకాణాల్లో ఎక్కడా కనిపించట్లేదు. పెద్ద దుకాణాల్లో మాత్రమే స్వైపింగ్‌ మెషిన్లు కనిపిస్తున్నాయి. కానీ నగదు తీసుకోవడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కాదు కార్డు ఉందని చెబితే అదనంగా రెండు శాతం వరకూ నగదు వసూలు చేస్తున్నారు. కార్డు ఎందుకు దండగ అంటూ కొంతమంది వ్యాపారులు నగదు లావాదేవీలనే ప్రోత్సహించడం గమనార్హం. ఇక బంగారం దుకాణాల్లో చాలావరకూ నగదుతోనే లావాదేవీలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం సహా జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సుల్లో టిక్కెట్ల కౌంటర్లలో ప్రయాణికుల కోసం స్వైపింగ్‌ మెషిన్లు ఏర్పాటు చేస్తామన్నారు.కానీ ఇప్పుడు ఏ ఒక్క కౌంటర్‌లోనూ కనిపించట్లేదు. స్వైపింగ్‌ మిషన్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ సమస్యలతో మొరాయిస్తుండటంతో వాటిని ఎప్పుడో పక్కనపెడేశారు. పెట్రోల్‌ బంకుల్లో స్వైపింగ్‌ మెషిన్లతో లావాదేవీలు 20 శాతం మించట్లేదు. పెద్ద నోట్లు రద్దు తర్వాత చిల్లర కొరత ఏర్పడిన సమయంలో చౌక డిపోల్లో తప్పనిసరిగా నగదురహితలావాదేవీలు అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. కానీ ప్రస్తుతం ఎక్కడా చౌక డిపోల్లో అమలు చేయటంలేదు. బ్యాంకుల్లో రూ.50 వేలుకు మించి విత్‌డ్రా, డిపాజిట్‌లకు పాన్‌ కార్డు అడుగుతుండటంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నగదు కొరత లేకున్నా విత్‌డ్రాలపై పరిమితి విధించడం వల్ల సమస్య తప్పట్లేదని కొంతమంది వాపోతున్నారు. ఏటీఎంల్లో కూడా తరచుగా నగదు కొరత సమస్య ఏర్పడుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6637
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author