నేతన్న వెత!

నేతన్న వెత!
November 08 14:41 2017
అనంతపురం,
తెలుగురాష్ట్రాల్లో చేనేతపై ఆధారపడ్డ వారి జీవితాల్లో మెరుగుదల లేదు. నేతన్నలకు అండగా ఉండేందుకు ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. వస్త్రాల విషయంలో ప్రజల అభిరుచుల్లో మార్పుల వల్ల చేనేతలకు తగిన ప్రాధాన్యం లభించడంలేదనే చెప్పొచ్చు. ఇటీవలిగా నేత వస్త్రాలకు ఆదరణ లభిస్తున్నా మరీ భారీగా లేకపోవడంతో ఈ పరిశ్రమనే జీవనాధారంగా మలచుకున్నవారికి సమస్యలు తప్పడంలేదు. ఇదిలా ఉంటే చేనేత కార్మికులకు సాయపడేందుకు కేంద్రం చేనేత క్లస్టర్లు మంజూరు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అనంతపురం జిల్లాలోని తొలి విడతగా మూడు క్లస్టర్లను మంజూరు చేశారు. ఒక్కో క్లస్టర్‌కు రూ.2 కోట్ల నిధులు ఇస్తారు. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో కొందరు నేత కార్మికులను ఎంపిక చేసి వారికి నైపుణ్యం కలిగిన మాస్టర్‌ వీవర్స్‌ ద్వారా డిజైన్స్‌, డయింగ్‌ తదితరాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణకు వచ్చే నేతన్నలకు రోజుకు రూ.210 చొప్పున చెల్లిస్తారు. కొత్తకొత్త డిజైన్స్‌, మరిన్ని మెలకువలు ఇందులో నేర్పుతారు. ఒక్కో క్లస్టర్‌ను మూడేళ్లపాటు నిర్వహిస్తారు. అందులో శిక్షణ ఇచ్చే నిపుణులు, ఇతర సిబ్బంది అందరికీ ఆ నిధుల నుంచే చెల్లింపులు జరపాలి. ఈ క్లస్టర్లతో ఆయా ప్రాంతాల్లో నేతన్నలకు మేలు కలుగుతుంది. మార్చి నెలలో మంజూరైన క్లస్టర్లు ఇప్పటికీ ఏర్పాటు కాకపోవడమే సమస్యగా మారింది.
ధర్మవరం, ఉరవకొండ, పుట్టపర్తికి ఒక్కో క్లస్టర్‌ మంజూరైంది. అయితే దాదాపు 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ క్లస్టర్ల ఏర్పాటులో పురోగతి లేకపోవడంపై స్థానిక నేతన్నలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి వీటికి నిధులన్నీ డెవలప్‌మెంట్‌ కమీషన్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్స్‌ (డీసీహెచ్‌) నుంచే వస్తాయి. ఆయా సొసైటీల ఖాతాల్లోనూ, శిక్షణకు వచ్చిన నేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో స్టయిఫండ్‌ నేరుగా జమ అవుతుంది. ఇలా కేంద్రం నుంచి పుష్కలంగా నిధులొచ్చే ఈ క్లస్టర్ల ఏర్పాటు విషయంలో జిల్లాలో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. ఎందుకు ఆలస్యమైందంటే కలెక్టర్‌ లేరనీ, విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో దస్త్రం ఆగిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి కలెక్టర్‌ పది రోజుల పర్యటనకు మాత్రమే విదేశాలకు వెళ్లారు. అంతకు ముందు నెలల తరబడి సమయం ఉన్నప్పటికీ ఇవి పట్టాలెక్కలేదు. తాజాగా ఈ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి ఇటీవల జరిగిన చేనేత టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో దస్త్రానికి ఆమోదం తెలిపారు. అయితే ఇవి కేత్రస్థాయిలో ఏర్పాటై అమల్లోకి వచ్చేందుకు ఎంత కాలం పడుతుందనేది చూడాల్సి ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన క్లస్టర్లు ఏర్పాటు చేసి, తమకు మద్దతుగా నిలవాలని నేత కార్మికులు విజ్ఞప్తిచేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6659
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author