నాడు కళకళ… నేడు విలవిల…

నాడు కళకళ… నేడు విలవిల…
November 09 21:30 2017
అదిలాబాద్,
కొమురంభీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం జంబుగ, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లలో పండ్ల మొక్కల ఉత్పత్తి, రైతు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో మామిడి, జామ, నిమ్మ తదితర పండ్ల మొక్కలను ఉత్పత్తి చేయడం, వివిధ తోటల పెంపకం, ప్రభుత్వ పథకాల్లో రైతులకు మొక్కలను సరఫరా చేయడం జరిగేది. అయితే  నీళ్లుపోసే నాథుడు లేక నీటి కోసం వేర్లు నోళ్లు తెరుస్తున్నాయి. పండ్లతోటల పెంపకంపై రైతులకు శిక్షణ, పండ్ల మొక్కల ఉత్పత్తి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాలు అధికారుల పర్యవేక్షణ, నిర్వహణలోపం ఫలితంగా మూసివేతదశకు చేరుకుంటున్నాయి. ఈ కేంద్రాల్లోని పండ్లు, మొక్కల విక్రయాలతో లక్షలాది రూపాయల ఆదాయాలు గడించగా, నేడు ఆదాయలమాట పక్కనుంచి ఉనికికోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. హరితహారం పేరిట కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిపై పెద్దగా శ్రద్ధ వహించకపోవడంతో ఉనికిని కోల్పోతున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆసిఫాబాద్‌ కేంద్రంగా కొమురంభీం జిల్లాగా ఏర్పాటు, కాగజ్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయడంతో ప్రస్తుతం ఈ జిల్లాలోనైనా ఈ అందాల తోటలు పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.  ఆయా ప్రాంతాల్లోని రైతులకు పండ్లతోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం ఈ కేంద్రాల లక్ష్యం. కొన్నేళ్లపాటూ ఓ వెలుగు వెలిగిన పండ్లు, పూల తొటలకు ప్రస్తుతం చీకటిరోజులు అలుముకుంటున్నాయి. ప్రభుత్వ పట్టింపులేనితనం, ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ లేమి ఫలితంగా జిల్లాలోని అన్ని కేంద్రాల్లో నిర్వహణ అస్తవ్యస్తమై పలు కేంద్రాలు మూసివేత దిశగా చేరుకుంటున్నాయి. 1989లో ఐటీడీఏ ఆధ్వర్యంలో కాజ్‌నగర్‌ మండలంలోని జంబుగ శివారులో దాదాపు 80 ఎకరాల్లో ఈ కేందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 10 ఎకరాల్లో మామిడి, ఐదు ఎకరాల్లో సపోట, అర ఎకరంలో నిమ్మ, ఒక ఎకరంలో జామ, ఐదు ఎకరాల్లో రేగు, ఆరు ఎకరాల్లో ఆయిల్‌ఫాం, ఐదు ఎకరాల్లో హైబ్రీడ్‌ చింతతోటలున్నాయి. కొన్నేళ్లపాటూ ఈ తోటలతో ఎంతో ఆదాయం వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ పెంచిన మామిడి మొక్కలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం ద్వారా లక్షలాది రూపాయల ఆదాయాలు గడించిన సందర్భాలున్నాయి. 1998లో గులాబీతోటల పెంపకం ప్రారంభించారు. ఇక్కడి గులాబీ మొక్కలతోపాటూ పూల విక్రయాల ద్వారా ఆదాయం సమ కూరేది. ఈ కేంద్రంలో 30 మంది కూలీలు పనిచేస్తుండగా పండ్ల మొక్కల పెంపకం, కేంద్రంలోని తోటల నిర్వహణ సక్రమంగా ఉండేది. ఆహ్లాదకర వాతావరణం ఉండడంతో ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలకు జంబుగ అంటే పిక్నికిక్‌ స్పాట్‌గా పేరుగాంచింది. ఇతర ప్రాంతాల నుంచి పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అనేక మంది పిక్నిక్‌వచ్చేవారు. కేంద్రం నిర్వహణ లేకపోవడంతో గతేడాది కేవలం ఒక్కకూలీతోనే పనులు సాగించారు. ఈ కేంద్రం చుట్టూ ఉన్న కంచె శిథిలావస్థకు చేరుకోవడంతో పశవులు యథేచ్ఛగా స్వైరవిహారం చేశాయి. దీంతో పండ్ల చెట్లకు నీటి తడులు అందించే నాథుడే లేకపోవడంతో ఎండుముఖం పట్టగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పచ్చదనం సంతరించుకుంటున్నాయి. ఈ ఏడాది ఏడుగురు కూలీలను ఏర్పాటు చేయగా కొంత మేర మామిడి మొక్కలను సాగు చేశారు. మామిడి మొక్కలకు హైబ్రీడ్‌ మామిడితో అంటుకట్టి మేలురకం మొక్కలను ఒక్కో మొక్కకు రూ. 30 చొప్పున వివిధ శాఖల ద్వారా రైతులకు అందించారు. ఈ ఏడాది సుమారు 70 వేల మొక్కలను ఈ కేంద్రం నుంచి వివిధ శాఖలకు సరఫరా చేయగా సుమారు రూ. 17 లక్షల ఆదాయం సమకూరింది. మామిడి పండ్ల విక్రయం ద్వారా సుమారు రూ. 2లక్షల ఆదాయం సమకూరింది. రైతులకు కూలీలకు ఎంతో ప్రయోజనాన్నిచ్చిన ఈ కేంద్రాన్ని కాపాడుకోవడంలో అధికారులు నిర్లక్షంగా వ్యవహరించడంతో ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ కేంద్రం నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ఏ ఒక్కనాడూ కన్నెత్తి చూడకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రైతులు పేర్కొంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6901
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author