మరింత విస్తృతం కానున్న గ్రేటర్ స్థాయి

 మరింత విస్తృతం కానున్న గ్రేటర్ స్థాయి
November 10 14:29 2017
హైద్రాబాద్,
గ్రేటర్ హైదరాబాద్ పరిధి మరింత విస్తృతం కానుంది. ఔటర్ రింగురోడ్డు లోపలి గ్రామాలను గ్రేటర్‌లో కలపాలని సంకల్పించారు. అంతేకాదు ప్రతి రెండు-మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక సర్కిల్ ఉండేలా వాటి సంఖ్యను 50కి పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని, ఔటర్ రింగురోడ్డు లోపలి పరిధిని పూర్తిగా గ్రేటర్‌లో విలీనం చేసేలా చర్యలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ తదితర శివారు ప్రాంతాల్లోని దాదాపు 34గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో ఇప్పటికే గ్రేటర్‌స్థాయిని చేరుకున్నాయి. అయినా అవి ఇంకా గ్రామపంచాయతీలుగానే కొనసాగుతున్నాయి. వాటిని గ్రేటర్‌లో కలపాలనే ప్రతిపాదన ఎంతోకాలంగా పెండింగులో ఉంది. గ్రామ పంచాయతీల్లో పాలకమండళ్లు ఉండడంతో సాధ్యంకాలేదు. అయితే వచ్చే ఏడాదినాటికి గడువు పూర్తవుతుండడంతో ఆయా గ్రామ పంచాయతీలను గ్రేటర్ పరిధిలోకి చేర్చాలని నిశ్చయించారు. అంతేకాదు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతమున్న 30సర్కిళ్లను 50కి పెంచాలని మంత్రి ఆదేశించారు. సర్కిల్ పరిధి రెండు-మూడు కిలోమీటర్లకన్నా ఎక్కువ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రసాదరావు కమిటీ సిఫారసుల ప్రకారం ఇటీవలే గ్రేటర్ సర్కిళ్లను 18నుంచి 30కి పెంచిన విషయం విదితమే. అయినా ఇంకా హయత్‌నగర్, రాజేంద్రనగర్, పటాన్‌చెరు తదితర సర్కిళ్ల కార్యాలయాలు ప్రజలకు ఆమడదూరంలో ఉన్నాయి. దీంతో పాలనా యంత్రాంగం ప్రజలకు మరింత అందుబాటులో ఉండేవిధంగా సర్కిళ్లను పెంచాలని మంత్రి స్పష్టంచేశారు. అంతేకాకుండా కార్పొరేటర్ కార్యాలయాలను సైతం ఆయా సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి ఆదేశించారు. అలాగే ఇంతకాలంగా శివారు ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థను జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తుండగా ఆ విధులను వాటర్‌బోర్డుకు అప్పగించాలని మంత్రి సూచించారు. దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధి 625చదరపు కిలోమీటర్లు కాగా, శివారు ప్రాంతాలు విలీనమైతే మరింత విస్తృతం కానుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7014
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author