కుల మత పొత్తులకు తెర తీసిన కేసీఆర్ 

కుల మత పొత్తులకు తెర తీసిన కేసీఆర్ 
November 11 13:15 2017
హైద్రాబాద్,
ఒకే ఒర‌లో రెండు క‌త్తుల్ని ఇమ‌డ్చ‌టం ఆయ‌న‌కే సాధ్యం! విజాతి ధ్రువాల‌ను కూడా వికర్షించేలా చేయ‌డం ఆయ‌న‌కే చెల్లుతుంది. గ‌డ‌చిన కొద్దిరోజులుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును గ‌మ‌నిస్తే… మ‌త ప్రాతిప‌దిక ఆయ‌న చేస్తున్న రాజ‌కీయం ఏంటో ఇట్టే అర్థ‌మౌతోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ కుల ప్రాధాన్యంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు చక్కచెడుతూ వ‌చ్చారు. తెలుగుదేశంతో పొత్తు ఉంటుంద‌నే సంకేతాలు ఇవ్వ‌డం ద్వారా తెలంగాణ‌లోకి ఒక బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పుడు.. మ‌త ప్రాదిప‌దికన‌ పావులు క‌దుపుతున్నారు. ప్ర‌స్తుతం అసెంబ్లీలో మైనారిటీల‌కు సంబంధించిన చ‌ర్చ‌లే జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి ఇవ్వ‌నంత‌గా నిజాం పాల‌న‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అస‌లైన తెలంగాణ చ‌రిత్ర‌ను రాయిస్తా అని కూడా అంటున్నారు. ఆంధ్రా పాలకుల హయాంలో నిజాంపై వ్య‌తిరేక అభిప్రాయం ఏర్ప‌డింద‌నీ, తెలంగాణ‌కు నిజాం చేసిన మేలు చాలా ఉంద‌నీ, చేసిన మంచిని వెలుగులోకి తీసుకుని వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తామంటున్నారు. ఈ సంద‌ర్భంగా కొంత‌మంది నిజాం ప్ర‌భువులు చేసిన మంచి ప‌నుల్ని స‌భ‌లో సీఎం చెప్పారు. ఇదే సంద‌ర్భంలో క్రైస్త‌వుల గురించి మాట్లాడం మ‌రీ విశేషం! వ‌క్ఫు బోర్డు మాదిరిగా క్రైస్త‌వుల‌కు కూడా ఓ సంస్థ ఉంటే బాగుంటుంద‌నే ప్ర‌తిపాద‌న తీసుకొచ్చారు. దానికి వచ్చే ఆదాయంతో చ‌ర్చి ఫాద‌ర్ల‌కు, రెవ‌రెండ్ల‌కూ జీతాలు ఇస్తే బాగుంటుంద‌ని అన్నారు. సంద‌ర్భం వ‌చ్చిందిగా.. తెరాస నేత‌లు కూడా స‌భ‌లో ముఖ్య‌మంత్రికి వంత‌పాడారు. చ‌ర్చిలో పాస్ట‌ర్ల‌కు గౌర‌వ వేతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సింగ‌రేణిలో క్రిస్మ‌స్‌, రంజాన్ ల‌కు ఇక‌పై సెల‌వులు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటాం అని కూడా ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. ఇక‌, హిందువు విష‌యానికొస్తే… ఎప్ప‌టిక‌ప్పుడు భారీ హోమాలు చేయ‌డం, స్వామీజీల ఆశీర్వాదాల కోసం ప‌రుగులు తీయ‌డం వంటివి ఇదివ‌ర‌కే చాలా చేసేశారు. దేవాదాయ శాఖ ద్వారా ఆల‌యాల్లో అర్చ‌కుల‌కు గౌర‌వ వేత‌నాలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి నిర్ణ‌యాల ద్వారా వ్య‌క్తిగ‌తంగా కొంత‌మందికి సాయం అందుతుంది. కానీ, సామాజికంగా చూసుకుంటే.. మ‌త ప్రాతిప‌దిక ప్ర‌జ‌ల‌కు ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఇది కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మైన రాజ‌కీయం అన‌డంలో సందేహం లేదు! ఒక‌ప‌క్క‌, స‌భ‌లో మైనారిటీల గురించి మాట్లాడుతూ… భాజ‌పాపై ఈగ వాల‌నీయ‌కుండా చేయ‌డం వారే సాధ్యం. అంటే, అటు హిందువుల మ‌నోభావాలు, ఇటు ముస్లింల మ‌నోభావాలు దెబ్బ తిన‌కూడ‌దు క‌దా! మొన్న‌టి స‌భ‌లో మైనారిటీల‌పై చ‌ర్చ జ‌రుగుతుంటే, నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై నిర‌స‌న తెలిపే అవ‌కాశం ఇవ్వాల‌ని కాంగ్రెస్ నేతలు కోరితే… అదేదో బ‌య‌ట‌కి వెళ్లి చేసుకోవాల‌ని సీఎం స‌ల‌హా ఇచ్చారు. అంటే, భాజ‌పాపై స‌భ‌లో విమ‌ర్శ‌లకు ఆస్కారం ఇవ్వ‌కుండా చేశారు, ఇంకోప‌క్క ముస్లింల గురించి చర్చిస్తున్న స‌మ‌యంలో భాజ‌పా ప్ర‌స్థావ‌న స‌భ‌లోకి రానీయ‌కుండా చేశారు! హిందు, ముస్లిం, క్రిస్టియ‌న్ల వారీగా ప్ర‌జ‌ల‌ను చూస్తూ… త‌మ కోసం కేసీఆర్ చాలా ఆలోచిస్తున్నార‌నే భావ‌న మ‌త ప్రాతిప‌దిక వారిలో క‌లిగేట్టు చేయ‌డం రాజ‌కీయంగా వారికి క‌లిసొచ్చే అంశ‌మే కావొచ్చు. కానీ, ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌లంద‌రినీ స‌మానంగా చూడాలి. ‘అన్ని మ‌తాల ప్ర‌జ‌ల‌నూ స‌మానంగా చూసుకోవాల‌’నే ధోర‌ణిలో కేసీఆర్ వెళ్తున్నారు! ఇది ఓటు బ్యాంకు పాల‌న కాకుంటే ఇంకేమౌతుంది..?
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7186
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author