డీసీసీబీలో వినూత్న పథకం

 డీసీసీబీలో వినూత్న పథకం
November 11 22:04 2017
ఖమ్మం,
డీసీసీబీ తమ ఖాతాదారులు ఆయా సంఘాల్లోనే నగదు తీసుకునే వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సహకార బ్యాంకులను బలోపేతం చేయడం కోసం ప్రతి సంఘాన్ని మినీ ఏటీఎం కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని 99 ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారు ఇక నగదు తీసుకునేందుకు బ్యాంకులను ఆశ్రయించే ఇబ్బంది లేకుండా.. నేరుగా మినీ ఏటీఎంల ద్వారా సహకార సంఘంలోనే నగదు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం అన్ని సంఘాలకు ఏటీఎంలతోపాటు మైక్రో సిమ్‌ కార్డులను పంపిణీ చేసింది. అయితే సహకార బ్యాంకులో ఖాతా ఉండి.. ఏటీఎం కార్డు ఉన్న వారికి ఇది ఉపయోగపడనుంది. ఒక్క ఏటీఎం కార్డు నుంచి రోజుకు రూ.10వేల వరకు నగదు తీసుకునే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లలో కలిపి 1.60లక్షల మంది సభ్యులు ఉండగా.. ఇప్పటికే 1.50లక్షల మందికి ఏటీఎం కార్డులు జారీ చేశారు. వివిధ కారణాల వల్ల వీటిలో అనేకం ఉపయోగించకపోవడం, కొన్నిచోట్ల రైతులు వీటిని వినియోగించాలన్నా అవి పనిచేయకపోవడం వంటి అంశాలను గుర్తించిన సహకార బ్యాంకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏటీఎం కార్డులన్నింటినీ యాక్టివేట్‌ చేస్తున్నారు. ఎర్రుపాలెం సహకార సంఘంలోని మినీ ఏటీఎం అక్కడి రైతులకు సేవలందిస్తోంది. ఇదే తరహాలో అన్నిచోట్ల రైతులకు సేవలందించేలా ఏటీఎం కేంద్రాలను సిద్ధం చేయాలని సహకార శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రారంభ దశలో కేవలం రైతుల ఖాతాలో ఉన్న నగదును తీసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నా.. మరో మూడు నెలల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ఆయా ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో ఇదే ఏటీఎం ద్వారా డబ్బులు వేసుకోవడం.. ఇతర ఖాతాల్లోకి నగదు బదిలీ చేసుకోవడం వంటి సేవలను కూడా అందించాలని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. ప్రతి రోజు ఒక్కో సహకార సంఘం నుంచి వెయ్యి మంది రైతులు రూ.10వేల చొప్పున నగదు తీసుకునేందుకు అనువుగా డబ్బును సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో ఖమ్మం, వైరా, సత్తుపల్లి, పెనుబల్లి, మర్లపాడు, అశ్వారావుపేట, కొత్తగూడెం, కూసుమంచి, ఎర్రుపాలెం, చర్ల, వెంకటాపురంలో ఏటీఎం కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటికి బహుళ ఆదరణ ఉండటంతో మరో ఐదు ప్రాంతాల్లో కొత్త ఏటీఎం కేంద్రాల కోసం సహకార బ్యాంకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. సహకార బ్యాంకుల్లో ఖాతా ఉన్న వారే కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలు కలిగిన ఖాతాదారులు సైతం సహకార సంఘాల వద్ద ఉన్న మినీ ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే సౌలభ్యం కల్పించారు.  నగదు అవసరాల కోసం మండల, పట్టణ కేంద్రాలకు వచ్చి ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గంటలతరబడి బారులు తీరాల్సిన అవసరం రైతులకు, గ్రామీణ ప్రాంత ఖాతాదారులకు లేకుండా.. ఆయా గ్రామాల్లోనే ఈ ఏటీఎం కేంద్రాలను నిర్వహించడం వల్ల రైతుకు సమయం ఆదా అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మరో వారం, పది రోజుల్లో జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో మినీ ఏటీఎం కేంద్రాలు రైతులకు, డీసీసీబీ ఖాతాదారులకు సేవలు అందించనున్నాయి. జిల్లాలో 47 కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిలు ఉండగా.. వాటి పరిధిలో పనిచేసే పీఏసీఎస్‌లు ఆయా బ్యాంకుల నుంచి రోజువారీగా నగదు తీసుకుని రైతులకు ఏటీఎం కేంద్రాల ద్వారా అందజేసి.. మిగిలిన మొత్తాన్ని లేదా ఆరోజు లావాదేవీలను బ్యాంకు అధికారులకు ఖాతాలవారీగా సమర్పించనున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7238
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author