హైదరాబాద్,
గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పానుగల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై శనివారం సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో జరుగుతున్న ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ శ్వేతా మహంతి, అధికారులతో చర్చించారు. రానున్న వేసవి నాటికి ఇంటింటికి తాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా మిషన్ భగీరథ పనులను యుద్ద ప్రాతిపదికగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనుల కాంట్రాక్టులు పొందినవారు వాటిని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే 15 రోజుల తర్వాత వాటిని రద్దు చేసి కొత్తవారికి అప్పగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 15 నాటికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐదు లక్షల లోపు వ్యయం ఉన్న పానుగల్లోని 35, వీపనగండ్లలో 15, చిన్నంబావిలో 17 హ్యాబిటేషన్లలో పనులన్నింటినీ వారం రోజుల్లో ప్రారంభించకపోతే రద్దు చేసి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఏయే గ్రామాల్లో దళితుల భూపంపిణీకి అందుబాటులో భూమి ఉంటే అక్కడ కొనుగోలు చేసి, పంపిణీ చేయాలని సూచించారు. ఇందులో గుంట భూమి కూడా లేని దళితులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ప్రతి గ్రామంలోనూ భూమిని గుర్తించాలని… పనులను స్థానిక ప్రజాప్రతినిధులే దగ్గరుండి ప్రారంభించేలా చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలను ప్రజలకు చేర్చే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపైనే ఉంటుందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గాన్ని 100 శాతం బహిరంగ మలమూత్ర విసర్జన లేని నియోజకవర్గంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. ఆ దిశగా ప్రజలను సమాయత్తం చేస్తూ ముందుకు పోవాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో పాటు…కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.