పన్ను బాధ తప్పింది 

 పన్ను బాధ తప్పింది 
November 13 11:12 2017
హైదరాబాద్,
 ఎన్నో ఏళ్లుగా చేస్తున్న న్యాయపోరాటం హెచ్‌ఎండీఏకు భారీ ప్రయోజనాన్నే అందించబోతోంది. ఒకటి రెండు కోట్లు కాదు రూ.983 కోట్ల వరకు పన్నుపోటు మినహాయింపు పొందింది. తద్వారా దేశంలోని ఇతర నగరాభివృద్ధి సంస్థలకూ ఓ దారి చూపించింది. ఇప్పుడు ఆ సంస్థలూ హెచ్‌ఎండీఏ తరహాలో తమకూ అవకాశం ఇవ్వాలని పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థలు, నగరాభివృద్ధి సంస్థలకు 2002 వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉండేది. అదే ఏడాది చట్టంలో మార్పులు,చేర్పులు చేసి ఒక్క స్థానిక సంస్థలకు మాత్రమే మినహాయింపు ఉంచారు. నగరాభివృద్ధి సంస్థలకూ వర్తించాలంటే ‘ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ కింద అవసరమైన పత్రాలను జతచేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి హెచ్‌ఎండీఏ అధికారులు దీనిని పట్టించుకోలేదు. తీరిగ్గా 2007మార్చిలో దరఖాస్తు చేశారు. అప్పుడైనా ఎందుకు మేల్కొన్నారంటే.. ఆ సమయంలో కోకాపేట తదితర ప్రాంతాల్లో భూములను వేలం వేయడం ద్వారా రూ.వేల కోట్ల ఆదాయం రాగా అప్పటి ప్రభుత్వం తీసుకుంది. ఆ మొత్తానికి సంబంధించి కట్టాల్సిన ఆదాయపు పన్ను భారం హెచ్‌ఎండీఏపై పడింది.
ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్‌ 12(ఏ) కింద పన్నును మినహాయించాలంటూ హెచ్‌ఎండీఏ చేసిన దరఖాస్తును 2007 సెప్టెంబరులో ఆదాయ పన్నుశాఖ డైరెక్టర్ తిరస్కరించారు. 2007-08, 2008-09 ఆర్థిక సంవత్సరాలకు రూ.624 కోట్లను చెల్లించాల్సిందేనంటూ ఐటీ శాఖ హెచ్‌ఎండీఏపై ఒత్తిడి తెచ్చింది. రెండు, మూడు సార్లు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. 2012 అక్టోబరులో ఆదాయ పన్నుశాఖ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు హెచ్‌ఎండీఏ అప్పీలు చేసింది. ఏడాది తర్వాత ఆ పిటిషన్‌నూ తిరస్కరించారు. తర్వాత హైకోర్టులో దాఖలు చేస్తే2014 జూన్‌లో అక్కడా తిరస్కరణకు గురైంది. అప్పటి నుంచి ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ గత ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో హెచ్‌ఎండీఏ పిటిషన్‌ దాఖలు చేసింది. ఉన్నత న్యాయస్థానం ఈ అంశంపై తిరిగి పరిశీలన చేయాలని ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. 2003-04 నుంచి 2013-14 వరకు మినహాయింపు ఇవ్వాలని హెచ్‌ఎండీఏ వాదించగా2007-08, 2008-09 సంవత్సరాలకే ఇస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రెండేళ్లకు రూ.624 కోట్ల పన్నుకు సంబంధించి హెచ్‌ఎండీఏకు భారీ వూరట లభించింది. మిగిలిన సంవత్సరాలకూ అవకాశమివ్వాలని మళ్లీ ట్రైబ్యునల్‌కు వెళ్లింది. ఒక్కసారి 12ఏఏ సెక్షన్‌ కింద రిజిస్ట్రేషన్‌ అయితే చాలు గత, రాబోయే సంవత్సరాలకూ మినహాయింపు వర్తిస్తుందంటూ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తంగా మినహాయింపు ఇచ్చినట్లైంది. 2007-08, 2008-09 సంవత్సరాలను కలుపుకొంటే రూ.983 కోట్ల పన్ను భారం తప్పిందన్న మాట. ఇక ముందు కట్టాల్సిన అవసరం ఉండదు.హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ ఆదాయ పన్నుశాఖకు 2003-04 నుంచి ఇప్పటివరకు రూ.983,20,49,384 చెల్లించాల్సి ఉండగా రూ.278,55,40,472 వరకు కట్టింది. అలా చెల్లించిన ఆ రూ.278 కోట్లు వెనక్కి వచ్చే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇన్నాళ్లూ పన్ను కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో హెచ్‌ఎండీఏ భూముల విక్రయంపై ఆచితూచి ముందుకు వెళ్లేది. ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయింది. భూముల్ని విక్రయించి తద్వారా సమకూరే ఆదాయంతో అభివృద్ధి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని భావిస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7348
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author