మారని పద్ధతి.. దరికిరాని లాభాలు

మారని పద్ధతి.. దరికిరాని లాభాలు
November 13 11:42 2017
 మెదక్,
అవగాహన లేకపోవడం.. మూస పద్ధతులు.. ఓ వైపైతే.. వర్షాభావం.. కల్తీ విత్తనాలు.. అధిక మందుల వాడకం.. రైతన్నలను మరోవైపు కంఠకంగా మారింది. ఎంతో ఆశతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినా ప్రకృతి వైపరీత్యాలు, దోమపోటు, ఇతర తెగుళ్లతో పంట చేతికి రాలేని దుస్థితి. అయితే వరికి సోకే రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలతో సంప్రదాయ పద్ధతులు వీడి కొత్త విధానాలను అవలంబిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చంటున్నారు ఈ యువరైతు క్రాంతికిరణ్‌. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన క్రాంతికిరణ్‌ తనకున్న నాలుగెకరాల్లో 15048 ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వరి సాగు చేశారు. సాగు వేసే సమయంలోనే సంప్రదాయ పద్ధతిలో కాకుండా కొత్త విధానాలను అవలంబించారు. దీనికితోడు ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకొని రసాయనాలకు దూరంగా ఉన్నారు. రసాయనాలు వాడకం వల్ల భూమి గుల్లకావడంతో పాటు లోపల సారాన్ని కాపాడే వానపాములు నశిస్తున్నాయి. తద్వారా వేసిన పంటలకు పోషకాలు అందక రోగాలు త్వరగా ఆశించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పంట మొదటి నుంచి ప్రకృతిని పాడుచేయకుండా ఉండే ఎరువులు కాపాడటమే కాకుండా అధిక దిగుబడి సాధించే వీలుంటుంది. పొలంలో 25 సెం.మీ.ల నుంచి 30 సెం.మీ. దూరంలో నాట్లు వేస్తే దోమపోటు రాకుండా ఉంటుందనేది నిపుణుల సూచన. ఇదే పంథాలో నడిచాడు ఈ యువరైతు. ఈ పద్ధతి ప్రస్తుతం సత్ఫలితాలను ఇచ్చింది. ఈ రైతు వేసిన నాటు ప్రస్తుతం గెల వేసింది. ఇప్పటివరకు రెండుసార్లు జీవామృతం, మూడుసార్లు పేడద్రావణాన్ని పిచికారీ చేశారు. దీనికితోడు మూడుసార్లు ఎన్‌ఎస్‌కేఈ ద్రావణాన్ని పిచికారీ చేశారు. దీంతో పంట ఏపుగా పెరగడంతో పాటు వరిగెల వేసింది. అదే పాత పద్ధతిని అనుసరించి వరి పండించే రైతులు నీటిని ఎక్కువగా అందించాలన్న ఆలోచనలో ఉంటారు. దగ్గరగా నాట్లు వేస్తే దోమలు వ్యాపిస్తాయి. దూరంగా నాట్లు వేసుకోవడం లేదా రెండు మీటర్లకు కాలిబాట తీసుకోవడం వల్ల గాలి, వెలుతురు సోకి దోమపోటు రాకుండా ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత కలుపుతీసే సమయంలో మాత్రమే నీరు అవసరం ఉన్న మేర అందించాడీ రైతు. ఆరుతడి విధానం గురించి తెలుసుకున్న క్రాంతికిరణ్‌ దాన్ని తన పొలంలో అమలు చేశారు. దీనికితోడు 15 రోజులకోసారి వేపగింజల కషాయం, మూత్ర ద్రావణాన్ని వినియోగించడంతో పంటకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా కాపాడుకోగలిగారు. రామాయం పేట 4091, నిజాంపేట మండలంలో 5197 ఎకరాల్లో వరిసాగు చేయగా ఇందులో సుమారు 50 శాతానికిపైగా దోమపోటు వల్ల దిగుబడులు చేతికి అందకుండా పోయింది. తమ పంటలో కొంతభాగం సోకిన దోమపోటు ఇతర రైతుల పంటలకు సోకకుండా తగలబెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. కిరోసిన్‌ పోసి తగలబెట్టడంతో భూమి పాడై తర్వాత వేసే పంటల దిగుబడి సైతం కోల్పోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7357
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author