బెలూన్ పండుగకు అధికారుల డుమ్మా

బెలూన్ పండుగకు అధికారుల డుమ్మా
November 15 16:16 2017
విశాఖపట్నం,
అంతర్జాతీయ ఫెస్టివల్..దక్షిణ భారతంలోనే మొదటిసారి నిర్వహణ.. మూడు రోజులపాటు ఆకాశంలో విహరించనున్న సాహసికులు.. ఇలా ఎంతో హడావుడి చేశారు.. తీరా ప్రారంభోత్సవానికి మాత్రం ప్రముఖులంతా డుమ్మా కొట్టారు. మరోవైపు.. వాతావరణం బెలూన్ సంబరాలను బుడగలా మార్చేస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అరకులోని స్ధానిక అధికారులు మినహా పెద్దగా ప్రజల నుంచి కూడా స్పందన లేకపోవడంతో హాట్ బెలూన్ ఫెస్టివల్ గాలితీసిన బుడగలా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ జిల్లాలోని ఏజెన్సీ అరకులో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటిం చడంతో కోట్ల ఖర్చుతో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ముహూర్త సమయానికి తీవ్ర అల్పపీడనం ఏర్పడటం.. ఈదురు గాలులు.. చిరుజల్లులకు తోడు అదే సమయంలో విశాఖలో అగ్రిహ్యాకథాన్కు ఉప రాష్ట్రపతి వస్తున్నారన్న కారణంతో ప్రముఖులు హాజరుకావలేదు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బెలూన్లు విహరించే ఎత్తును 5వేల అడుగుల నుంచి 40 అడుగులకు కుదించేశారు.అంతా.. ఇంతా.. అని చివరికి బెలూన్ పండగ పూర్తి కాకముందే గాలి తీసేశారు ప్రభుత్వ పెద్దలు. అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్కు ఆతిథ్యమిచ్చేందుకు అరకు ముస్తాబైనా… ప్రారంభోత్సవం చేసేందుకు పెద్దలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆశించిన స్ధాయిలో బెలూన్ ఫెస్టివల్ కు స్పందన రాలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా పండుగ చేస్తున్నామని చెప్పిన పాలకులు ఇప్పటికే రూ.ఐదు కోట్ల పైన ఖర్చు చేశారని అంచనా. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు బుధవారం నుంచి విశాఖ నగరంలో ప్రారంభం కానున్న అగ్రి హాకథాన్ సదస్సు ఏర్పాట్లలో ఉన్న దృష్ట్యా రావడం సాధ్యం కాదని ముందుగానే స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.  జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కూడా ఉప రాష్ట్రపతికి స్వాగత ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో అరకు రాలేదు. కృష్ణా జిల్లా విజయవాడలో ఫెర్రీ ఘాట్ వద్ద రెండురోజుల కిందట జరిగిన బోటు ప్రమాద ఘటన నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అరకు పర్యటనను వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన దరిమిలా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు కూడా అరకు రావడం లేదని తెలుస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7622
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author