కరీంనగర్ లో రెచ్చిపోతున్న కల్తీ మాఫియా

కరీంనగర్ లో రెచ్చిపోతున్న కల్తీ మాఫియా
November 17 14:03 2017
కరీంనగర్,
అక్రమార్జనే ధ్యేయంగా కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. ప్రతీ ఆహార పదార్ధాన్నీ కల్తీ చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. ఈ దందాను నియంత్రించేందుకు సరైన అధికార యంత్రాంగం లేకపోవడం ఓ సమస్య అయితే.. ఉన్న సిబ్బందీ అలంకారప్రాయంగా మారడంపై స్థానికులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అధికారుల ఉదాసీనత వల్ల కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారని విమర్శిస్తున్నారు. పండ్లు, తినుబండారాలు, వంట నూనె ఉత్పత్తులను విచ్చలవిడిగా కల్తీ చేయడంతో ప్రజలనుకొత్త కొత్త రోగాలు ముప్పిరిగొంటున్నాయి. ఈ క్రమంలో హోటళ్లు, సూపర్‌ మార్కెట్లు, పండ్ల దుకాణాలు, తినుబండారాలు, నూనె దుకాణాలను ఎప్పటికప్పుడు ఆహార తనిఖీ విభాగం తనిఖీ చేయాలి. అయితే ఈ తరహా తనిఖీలు మందగించిపోవడం జిల్లావాసుల్లో అసంతృప్తి పెంచేస్తోంది. ఇదిలా ఉంటే గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫుడ్‌ సేప్టీ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి నిర్ణీత లక్ష్యం ఉంటుంది. కానీ మూడు నెలలుగా అధికారులే లేక కార్యాలయం వెలవెలబోతోంది. ఒక అటెండర్‌ మినహా మిగతా పోస్టులన్ని ఖాళీయే. మొత్తంగా ఈ విభాగంలో సిబ్బంది కొరత తాండవిస్తుండడం.. అక్రమార్కులకు వరంగా మారింది. తనిఖీలు తగ్గిపోవడంతో తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తూ దండుకుంటున్నారు.ఆహార పదార్థాల విక్రయాలకు సంబంధించిన అనుమతుల జారీలో ఆహార తనిఖీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కమర్షియల్‌ టాక్స్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, రూ.వందచాలన్‌, వ్యాపార పరిణామానికి సంబంధించిన స్వీయ నిర్ణయం, అఫిడవిట్‌, దుకాణ ఫొటోతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ విధంగా దరఖాస్తు చేస్తే నెలరోజుల్లోగా అనుమతి జారీ చేయాలి. అయితే దరఖాస్తును నెలరోజుల పాటు తిరస్కరించకుండా ఉంచితే దానిని ఆమోదించినట్లే. కానీ అనుమతుల జారీలో మామూళ్లదే పైచేయిగా మారిందన్న విమర్శలున్నాయి. నిబంధనలు అంతగా పట్టించుకోకుండానే రెండు రోజుల్లో అనుమతులను జారీ చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దుకాణాలవారీగా విక్రయాలను బట్టి మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వాణిజ్యపన్నుల శాఖ, రెవెన్యూ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రవాణాశాఖలకు అధికారులున్నా వారెవరూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అందుకే జిల్లాలో కల్తీ దందా విజృంభిస్తోందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్న కల్తీ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7835
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author