హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నరకం 

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నరకం 
November 17 14:20 2017
హైద్రాబాద్,
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నరకం కొనసాగుతోంది. జీవితంలో సగం ట్రాఫిక్‌ జామ్‌లలోనే గడిచిపోతోందని నగర పౌరులు భావిస్తున్నారు. ఆరోగ్యం ముఖ్యమనుకుంటున్న వాళ్లు శివార్లకు మారిపోయారు. అత్యవసరమైతే తప్ప నగరంలోకి అడుగు పెట్టడం లేదు. అధికారులు మాత్రం తాము తీసుకున్న చర్యల వల్ల గతంలో కన్నా నగరంలో పరిస్థితి చాలా మెరుగు పడిందని అంటున్నారు. యూటర్న్‌లు పెంచి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ తగ్గించేయడంతో వాహన వేగం పెరిగిందంటున్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓలాక్యాబ్‌ లెక్కల్ని పరిగణనలోకి తీసుకొని దేశంలోని ఇతర అన్ని మెట్రోల కన్నా హైదరాబాద్‌లో వాహనాల సగటు వేగం ఎక్కువగా ఉందని ఘనంగా చెబుతున్నారు. నగరంలో ‘పీక్‌ టైం సగటు వేగం’ లెక్కలు చెప్పడం లేదు. ఓలా, ఉబర్‌ లాంటి క్యాబ్‌ సంస్థలు 24 గంటలూ రోడ్ల మీద తిరుగుతాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు క్యాబ్‌ల సగటువేగం అరవై పైనే ఉంటుంది. అందుకే ట్రాఫిక్‌ తీవ్రంగా ఉన్న సమయాన్ని కలుపుకొన్నా వాటి సగటువేగం 27 కిలోమీటర్లు ఉంటోంది. ఆఫీసు పనులు, సొంత పనుల మీద కార్లు, బైకులు, బస్సుల్లో తిరిగే సామాన్య ప్రజలకు ఎక్కడా 27 కిలోమీటర్ల సగటు వేగం కనిపించదు. కొన్నిప్రాంతాల్లోనే యూ టర్న్‌ విధానం ఫలితాలు ఇస్తోంది. 90 శాతం ప్రాంతాల్లో ఇప్పటికీ ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యతో నగరంలో రోడ్డు మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌జామ్‌లు సర్వసాధారణమై పోయాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఖైరతాబాద్‌ నుంచి మియాపూర్‌కు, అమీర్‌పేట నుంచి బాలానగర్‌, బాలానగర్‌ నుంచి బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌ టు బాలానగర్‌, లక్డీకాపూల్‌ నుంచి మెహిదీపట్నం, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, చిక్కడపల్లి నుంచి కోఠి, మొజంజాహి మార్కెట్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ ఇలా అనేకరూట్లలో ఇప్పటికీ ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారం కాలేదని స్వచ్ఛంద సంస్థల క్షేత్రస్థాయి సర్వేల్లో తేలింది. ఈ ప్రాంతాల్లో వేగం 20 కిలోమీటర్లు దాటడం లేదు. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సర్వే ప్రకారం హైదరాబాద్‌ సగటు వేగం 1981లో 17 కిలోమీటర్లు, 2006లో 12 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం సగటున 20 కిలోమీటర్లకు మించడం లేదని స్పష్టమైంది.గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు మార్గంలో ఔటర్‌రింగ్‌ రోడ్డుపై 24.3 కిలోమీటర్ల దారిలో పగటి పూట అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ స్ట్రెచ్‌లో వాహనాల రద్దీ అధికంగా ఉండటం, వాహనదారుల నిర్లక్ష్యం, ఎదుటి వాహనాలను అధిగమించాలన్న తాపత్రయంతోపాటు, ఒకేసారి వేగాన్ని తగ్గించే క్రమంలోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మలుపుల వద్ద సైతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వాహనాలను నడిపేస్తున్నారు. రోజూ 75 వేల వాహనాలు ఔటర్‌ రింగ్‌రోడ్‌పై తిరుగుతున్నాయి. వేగాన్ని నియంత్రించక పోవడం, మద్యం తాగడం, నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వంటి కారణాల వల్ల ప్రమాదాల స్థాయి పెరిగింది. ఔటర్‌పై 2014లో 75 ప్రమాదాలు, 2015లో 84, 2016లో 104 ప్రమాదాలు జరిగాయి. మితిమీరిన వేగంతో అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢీ కొట్టడం, డివైడర్‌లను ఢీకొట్టడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి.గ్రేటర్‌ పరిధిలో 9 వేల కిలోమీటర్ల రహదారులున్నాయి. ప్రధాన రోడ్లు 1500 కిలోమీటర్ల మాత్రమే ఉన్నాయి. వాహనాలు మాత్రం 48 లక్షలకు పైగానే ఉన్నాయి. వాహనాలన్నీ ఒకేసారి రోడ్లపైకి వస్తే రోడ్లు సరిపోవు. నిత్యం వెయ్యికి పైగా కొత్త వాహనాలు యాడ్‌ అవుతున్నాయి.నగరంలో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఉదయం ఉద్యోగానికి బయలు దేరింది మొదలు సాయంత్రం ఇంటికి చేరుకునే వరకు రోడ్లపైనే ఎక్కువ కాలం గడపాల్సి వస్తోంది. పీక్‌ అవర్స్‌లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి గంట పడుతోంది. వర్షం, ఇతర కారణాలతో ట్రాఫిక్‌ నిలిచిపోతే మరో గంట నిరీక్షణ తప్పదు. 20-30 కిలోమీటర్లు ఆఫీసుకు వచ్చిపోయేవాళ్లకు రోజుకు 4-5 గంటలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నగర విస్తీర్ణంలో రహదారుల వ్యవస్థ 20-25 శాతం ఉంటుంది. హైదరాబాద్‌లో 9 శాతం మాత్రమే రోడ్ల నెట్‌వర్క్‌ ఉంది. ‘లీ లోసియేట్స్‌’ అధ్యయన నివేదిక ప్రకారం 2001లో నగర జనాభాలో ప్రతి వెయ్యి మందిలో 68 మంది ద్విచక్ర వాహనాలు, 8 మంది కార్లు వినియోగించే వారున్నారు. 2011 నాటికి ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య 155కు పెరగగా కార్ల వినియోగిస్తున్న వారి సంఖ్య 23కు పెరిగింది. ఆరేళ్లలో వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ద్విచక్ర వాహనాలు 255కు, కార్లు వాడేవారు 40కి పెరిగారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7848
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author