రూ.2 కోట్లు మట్టిపాలే.. 

రూ.2 కోట్లు మట్టిపాలే.. 
November 17 19:33 2017
ఆదిలాబాద్,
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో నిధులు వృథా అవుతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్‌ నుంచి కెరమెరి రహదారి నిర్మాణ పనులు ఇదే కోవలోకి వస్తాయి. పట్టణానికి సమీపంలో ఉన్న వాయుసేన స్థలానికి తోడు ప్రైవేటు భూమి కలిపి వైమానిక దళ శిక్షణ కేంద్రం కోసమని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. శిక్షణ కేంద్రం ఏర్పాటైతే మధ్యలో ఉన్న అనుకుంట గ్రామానికి వెళ్లే రహదారి ఎత్తివేసి సీసీఐ పక్కనుంచి రోడ్డు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తాజాగా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఇవేమీ తమకు పట్టనట్లు అనుకుంట రహదారి పనులు విస్తరిస్తూ కొత్త పనులు చేపడుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. పనులు పూర్తయ్యాక శిక్షణ కేంద్రం ఏర్పాటైతే ఈ నిధులనీ వృథాననే ప్రచారం మొదలైంది.
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ పట్టణానికి ఆనుకొని ఖానాపూర్‌ కాలనీవైపు ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో 362 ఎకరాల విశాలమైన స్థలం ఉంది. సంబంధిత అధికారులు ఇక్కడ  ఎయిర్ ఫోర్స్ ట్రానింగ్ సెంటర్ ఏర్పాటుకు మరికొంత ప్రైవేటు స్థలం కావాలని ప్రతిపాదించారు. దీనికి చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ, ప్రైవేటుభూమి కలిపి 1562.25 ఎకరాలు గుర్తించారు. మొత్తం 1924.25 ఎకరాల స్థలంలో శిక్షణ కేంద్రం కోసమని రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. మరోపక్క ఈ శిక్షణ కేంద్రంలోనే వాణిజ్య, ప్రజల అవసరాల కోసం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో కేసీఆర్‌ ప్రకటించారు. అయితే రాష్ట్రప్రభుత్వం దీనిపై కేంద్రానికి నిరభ్యంతర పత్రం ఇవ్వకపోవడంతో దీని ఏర్పాటులో జాప్యమవుతోంది. వీటన్నిటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భూముల లావాదేవీలు నిలిచిపోయాయి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కేంద్రం ఏర్పాటైతే ప్రస్తుతం ఆదిలాబాద్‌ పట్టణంలోని వినాయక్‌చౌక్‌ నుంచి జైనథ్‌ మండలం సాత్నాల రోడ్డులో కొంత భాగం పోతుంది. పట్టణశివారు నుంచి ఆదిలాబాద్‌ మండలం అనుకుంట గ్రామం దాటాక మలుపు వరకు దాదాపు 2 కిలోమీటర్ల వరకు రహదారి పూర్తిగా వైమానిక దళ శిక్షణ కేంద్రం పరిధిలోకి వెళుతుందని ఆ రోడ్డును ఎత్తివేస్తారని అధికారులు చెబుతూ వచ్చారు. దీంతో రాకపోకల కోసం పట్టణంలోని సిమెంటు పరిశ్రమ పక్క నుంచి కొత్త రహదారిని నిర్మించి దాన్ని ఆదిలాబాద్‌ మండలంలోని బంగారుగూడ వద్ద సాత్నాల రహదారికి కలిపేలా ప్రణాళిక తయారు చేశారు. రోడ్లుభవనాలశాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ పట్టణంలోని వినాయక్‌చౌక్‌ నుంచి అనుకుంట గ్రామం మీదుగా జైనథ్‌ మండలం సాత్నాల,నార్నూర్‌ మీదుగా కెరమెరి సమీపం వరకు దాదాపు 55 కిలోమీటర్లకు రోడ్డు పనులు చేపడుతున్నారు. ఒకవరుస ఉన్న రోడ్డును రెండు వరుసలుగా మార్చి కొత్తరోడ్డు వేసేందుకు మొత్తం రూ.85 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయి. ఇందులో అనుకుంట రోడ్డు పనిపై అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని వినాయక్‌చౌక్‌ నుంచి శివారులో ఉన్న ఖానాపూర్‌ కాలనీ దాటాక మూల మలుపు వరకు రహదారి విస్తరణ అందరికి ఉపయోగపడుతుంది. అయితే ఖానాపూర్‌ కాలనీ అయ్యాక మూల మలుపు నుంచి అనుకుంట గ్రామం మీదుగా బంగారుగూడ గ్రామానికి వెళ్లే మలుపు వరకు ఎత్తివేసే ప్రతిపాదనున్న రెండు కిలోమీటర్ల మేర రహదారిని విస్తరిస్తుండడంతో ఆ ఖర్చు దుబారా అవుతుంది. దాదాపు రూ. 3కోట్ల నిధులు మట్టిపాలేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=7895
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author