రైతు కష్టం.. దళారీకి లాభం

రైతు కష్టం.. దళారీకి లాభం
November 23 11:31 2017
ఖమ్మం,
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గత ఏడాది పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా ఎక్కువ శాతం మంది రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో మిరపను సాగు చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలోపంతో కొందరు రైతులు నకిలీ మిరప విత్తనాలతో నష్టపోతే, మరికొంత మంది సదరు కష్టాలను దిగమింగి మిరప పంటలను పండించారు. తీరా పంట మార్కెట్‌కు వస్తే ప్రైవేటు వ్యాపారుల మాయాజాలంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఎదురైంది. దీంతో కడుపుమండిన రైతులు నిరసన తెలుపడం, అది కాస్తా వివాదంగా మారి కొందరు రైతులు జైలుకు వెళ్లడం పాఠకులకు విధితమే.
వ్యాపారుల చేతుల్లో.. నాడు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన మిరప పంట నేడు వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో క్వింటా మిరప రూ.1,500 కూడా ధర పలకని సరకు నేడు రూ.9,900 వరకు పలుకుతోంది. రైతుల పేరున ఎక్కువ శాతం శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన సరకు ప్రస్తుతం మార్కెట్‌కు చేరుతోంది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో 42 శీతల గిడ్డంగులు ఉన్నాయి. వీటిలో నిల్వ సామర్థ్యం 28 లక్షల బస్తాలు. ఒక్కో బస్తా 30 కిలోల నుంచి 40 కిలోల వరకు ఉంటుంది.
గతంలో శీతల గిడ్డంగుల్లో సరకు నిల్వ చేస్తే రూ.145 తీసుకొనే వారు. ఈ ఖరీదు కాల వ్యవధి 6-8 నెలలు. కానీ ఈ ఏడాది మిరప పంట ఎక్కువ మొత్తంలో పండటంతో ఒక్కో బస్తాకు మొదట్లో రూ.162 తీసుకున్నారు. అనంతరం అమాంతంగా రూ.202కు పెంచారు. నిబంధనల ప్రకారం సదరు రుసుమును సరకు అమ్మినపుడే రైతుల నుంచి వసూలు చేయాలి. కానీ కొన్ని శీతల గిడ్డంగులు ముందుగానే వసూలు చేస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే వారు స్పందించి రైతుల వద్ద నుంచి ముందే రుసుము తీసుకోవద్దని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కువ సరకు మాత్రం వ్యాపారులే కొనుగోలు చేసి అదే రైతుల పేర్లపైన శీతల గిడ్డంగుల్లో దాచి ఉంచడం గమనార్హం.
ఉద్యానవన శాఖ శీతల గిడ్డంగుల నిర్మాణానికి సుమారు 50 శాతం రాయితీ కల్పిస్తుంది. ఉదాహరణకు రూ.కోటితో శీతల గిడ్డంగి నిర్మిస్తే రూ.50 లక్షలు రాయితీ వస్తుంది. సదరు గిడ్డంగిలో 40 శాతం సరకు రైతులకు చెందినదై ఉండాలి. గిడ్డంగుల నిర్మాణ సామర్థ్యంలో తేడాలుంటాయి. లక్ష బస్తాలు, 1.20 లక్షల బస్తాలు, 1.50 లక్షల బస్తాలు తదితర సామర్థ్యంతో శీతల గిడ్డంగుల నిర్మాణం ఉంటుంది. రైతులు తమ పంటకు సరైన ధర లభించడంలేదని భావిస్తే తనకు నచ్చిన గిడ్డంగిలో సరకు నిల్వ చేసుకొని, మంచి ధర వచ్చినపుడు అమ్ముకోవాలన్న బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం వీటి నిర్మాణానికి ప్రోత్సాహకం అందిస్తోంది. కానీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సదరు లక్ష్యం నీరుగారుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8575
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author