ఇవాంక రాక కోసం

ఇవాంక రాక కోసం
November 24 14:06 2017
 హైదరాబాద్
ఇవాంక రాక కోసం భాగ్య నగరం ప్రత్యేకంగా ముస్తాబవుతోంది. పాత బస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  సదస్సు జరిగే హెచ్‌ఐసీసీ ప్రాంతంలో రహదారులను అందంగా ముస్తాబు చేశారు. ఇవాంకకు బహుకరించేందుకు లాడ్‌ బజార్‌లోని గాజుల వ్యాపారులు ప్రత్యేకంగా గాజులను తయారు చేశారు. అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్య సదస్సు (గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌–జీఈఎస్‌)లో పాల్గొనేందుకు నగరానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్‌ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వస్తున్న నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఫలక్‌నుమా ప్యాలెస్‌ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఫారూఖ్‌నగర్, ఫాతిమానగర్, బీబీకా చస్మా, జంగమ్మెట్, మదీనా కాలల్లో ఇంటింటి సర్వే నిర్వహించి స్థానికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు.  కొత్తగా ఎవరికీ ఇళ్లను అద్దెకు ఇవ్వరాతని ఆదేశాలు జారీ చేశారు.ఫలక్‌నుమా ప్యాలెస్‌ పరిసర ప్రాంతాల్లోని గల్లీల్లో సైతం కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 28న చిరు వ్యాపారులు వీధుల్లోకి రాకూడదని తెలిపారు. పోలీసుల ఆంక్షలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 180 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానుండటంతో బందోబస్తు తప్పదని పోలీసులు పేర్కొన్నారు. 28న ఫలక్‌నుమా ప్యాలెస్‌ పరిసర ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ నెలకొననుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాంక ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో స్థానికులు పూర్తిగా సహకరించాలని దక్షిణ మండలం అదనపు డీసీపీ మహ్మద్‌ గౌస్‌ మోహీద్దీన్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ ఫయాజుద్దీన్‌లు కోరారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌ పరిసర బస్తీల ప్రజలతో బుధవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో తమ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వస్తున్నందున బందోబస్తుకు సహకరిస్తూ ప్రతినిధులకు స్వాగతం పలకాలన్నారు.చారిత్రాత్మక  భాగ్యనగరం మరో  అంతర్జాతీయ వేడుకలకు సన్నద్ధమవుతున్న వేళ….పాతబస్తీలోని లాడ్‌బజార్‌  ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది.     మహ్మద్‌ కులీకుతుబ్‌షా  గారల పట్టి హయాత్‌ బక్షీ  కోసం  అప్పట్లో  ఏర్పాటు చేసిన చుడీబజార్‌ (లాడ్‌ బజార్‌)  ఇప్పుడు   అగ్రరాజ్య అధినేత  డోనాల్డ్‌ ట్రంప్‌  ముద్దుల  కూతురు   ఇవాంకా ట్రంప్‌  సందర్శన కోసం ముస్తాబైంది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ముత్యాలు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను  ప్రతిబింబించే గాజులకు  నెలవైన హైదరాబాద్‌ లాడ్‌బజార్‌  ప్రత్యేక ఆకర్షణగా  మారింది. ఇవాంక మనస్సు దోచుకొనే  రకరకాల డిజైన్‌ గాజులతో  దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఒక్క గాజులే కాకుండా  వెరైటీ వస్త్రాలు, ఆభరణాలు, శతాబ్దాలుగా మగువల మదిని దోచుకుంటున్న డిజైన్‌లు  ఇవాంకా కోసం పాతబస్తీలో  ప్రదర్శనకు ఉంచారు. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సులో  భాగంగా   ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందుకు  హాజరుకానున్న  ఇవాంకా  పాతబస్తీలోని లాడ్‌బజార్‌ను సైతం సందర్శించవచ్చుననే సమాచారంతో  ప్రభుత్వం  ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. లాడ్‌ బజార్‌లోని ఖాజా బ్యాంగిల్‌ స్టోర్‌ యజమాని మహ్మద్‌ అన్వర్‌ భారత జాతీయ జెండా, అమెరికా దేశ పతాకం రంగులతో నెల రోజుల పాటు శ్రమించి అద్భుతమైన  గాజుల పేరును  తయారు చేశారు.  హైదరాబాదీ లక్క బ్యాంగిల్స్‌  తరహాలో తయారు చేసిన ఈ గాజులలో   కట్‌ గ్లాస్‌ స్టోన్‌ను సెట్‌లో అమర్చారు. ఇవాంక  ట్రంప్‌ లాడ్‌ బజార్‌ సందర్శనకు  వస్తే భారత, అమెరికా దేశ పతాకాలతో రూపొందించిన గాజుల సెట్‌ను బహూకరించనున్నట్లు  అన్వర్‌ తెలిపారు.  జీఈఎస్‌ సదస్సు ఏర్పాట్లలో భాగంగా జీహెచ్‌ఎంసీ మాదాపూర్‌ సైబట్‌టవర్‌  సమీపంలో చేపడుతున్న ఫుట్‌పాత్‌ పనులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్‌లోని కరాచీ బేకరీ నుంచి సైబర్‌ టవర్‌ జంక్షన్‌తో పాటు మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వైపు ఫుట్‌పాత్‌ పనులు కొనసాగుతున్నాయి. సైబర్‌టవర్‌ జంక్షన్‌లోని బీటీ రోడ్డు వాహనాల రద్దీకి అనుగుణంగా లేకపోవడంతో ప్రతిరోజూ ట్రాఫిక్‌ జాం నెలకొంటుంది.  హె చ్‌ఐసీసీ రోడ్డులోని ఖానామెట్‌ చౌరస్తాలో రోడ్డు గ్రీన్‌ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు.హెచ్‌ఐసీసీ వెళ్లే రోడ్డులో గౌసియా కేఫ్‌ వద్ద డెలిగేట్స్‌కు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఆర్చ్‌ సమీపంలో బుద్ద విగ్రహం ఏర్పాటు చేయడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.  రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లకు ట్రీ పెయింటింగ్‌ వేశారు. పచ్చిక, పూల మొక్కలు నాటుతున్నారు. సర్వీస్‌ రోడ్డులోని పూలకుండీలకు వైష్ణవి ఆర్కిటెక్చర్‌ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా రంగులు అద్దుతున్నారు.హైటెక్స్‌ కమాన్‌తో పాటు మేడిన్‌ లైటింగ్‌ అమర్చుతున్నారు. హైటెక్స్‌ నుంచి హెచ్‌సీసీ వరకు రంగురంగులు విద్యుత్‌ బల్బులు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రతినిధుల రాకపోకలకు  ఎంపిక చేసే  వాహనాల విషయంలో రవాణా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విదేశీ  ప్రతినిధుల భద్రత, సౌకర్యం  దృష్ట్యా  వాహనాల ఎంపికను సీరియస్‌గా  పరిగణిస్తున్నారు. దీంతో  ప్రైవేట్‌ ట్రావెల్స్, తదితర వర్గాల నుంచి  వాహనాలను సేకరించడం ఆర్టీఏకు సవాల్‌గా మారింది. ఇందుకు వినియోగించే వాహనాలన్నీ  2016, 2017  సంవత్సరానికి చెందినవి మాత్రమే అయి ఉండాలని  ప్రభుత్వం  స్పష్టం గా పేర్కొనడంతో డిమాండ్‌కు తగిన విధంగా  వాహనాలను సేకరించడం సమస్యగా మారింది.  ప్రతినిధుల కోసం  250  ఇన్నోవాలు,  భద్రతా సిబ్బంది కోసం మరో 50 ఇన్నోవాలను  ప్రతిపాదించారు. వీటికితోడు ఆర్టీసీ  సుమారు  60  మల్టీ యాక్సిల్‌  ఓల్వో బస్సులను ఏర్పాటు చేసింది. కొన్ని మార్గాల్లో పెద్ద బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తాజాగా  అధికారులు మినీ బస్సులపై దృష్టి సారించారు. గత  రెండు రోజులుగా  సుమారు  40  మినీ  బస్సులను ఎంపిక చేయగా, వాటిలో చాలా వాహనాలకు గీతలు (స్క్రాచెస్‌) ఉన్నాయని, లుక్‌ బాగా లేదనే కారణంతో  తిప్పి పంపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8805
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author