పశ్చిమలో ప్రసూతి డాక్టర్లు కావాలి….

పశ్చిమలో ప్రసూతి డాక్టర్లు కావాలి….
November 25 11:48 2017
ఏలూరు,
ఏలూరు కేంద్ర ఆసుపత్రితోపాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెంలలో ప్రాంతీయ ఆసుపత్రులు ఉన్నాయి. అన్నిచోట్లా అన్ని విభాగాలున్నా వీటిల్లో వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాలకు సంబంధించి 45 పోస్టులు ఖాళీగా ఉండగా వీటిలో 13 ప్రసూతి నిపుణులు, 12 మంది పిల్లల వైద్యులు, 10 మంది మత్తు వైద్యులు, 10 మంది ఎంబీబీఎస్‌ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఏలూరు ఆసుపత్రికే రోజుకు 1800 మంది ఓపీ ద్వారా వస్తుంటారు. అలాగే మిగిలిన ఆసుపత్రులకు 5 వేల మంది మొత్తం సరాసరిన 7 వేల మంది రోగులు వస్తుంటారు. కానీ, వీరికి సేవలు అందించే వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది సంఖ్య తక్కువగానే ఉంది. పారామెడికల్‌ సిబ్బందిపై పెనుభారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది వరకు కావాల్సి ఉంది. ఉన్న వారిపైనే భారం పడుతుండటంతో తమకు అలవాటు లేని వాటిపైనా శిక్షణ పొంది సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని నివారించడానికి జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి ఆధ్వర్యంలో 50 మంది పారామెడికల్‌ సిబ్బందితో కూడిన బృందాన్ని కొత్తగా నియమించాలని ప్రతిపాదించారు.అలాగే ఏలూరు, భీమవరంలలో రేడియాలజీ విభాగాల్లో నిపుణులు లేరు. ఏలూరులో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఇంటెన్సివిస్టు పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. వీటి నిర్వహణ మిగిలిన సిబ్బందికి తెలియక రూ.కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన పరికరాలు వృథాగా ఉంటూ వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది.వాస్తవానికి కేంద్ర, ప్రాంతీయ ఆసుపత్రులకు వచ్చే వారిలో అధికశాతం మంది ప్రసూతి, చిన్నపిల్లల సమస్యలతో వచ్చేవారే అధికం. కాన్పుల కోసం సర్కారు ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. ఏలూరులోని ప్రసూతి విభాగం కార్పొరేట్‌ స్థాయిని తలపిస్తుంది. దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అయితే దీనిలో వైద్యుల కొరత మాత్రం తీర్చలేదు. ఇక్కడ పది మంది ప్రసూతి నిపుణులు ఉండాల్సి ఉండగా నలుగురు మాత్రమే పని చేస్తున్నారు. వీరిలో ఒకరు రాత్రిపూట విధుల్లో ఉంటే మిగిలిన ముగ్గురు శస్త్ర చికిత్సలు, ఇతర ఓపీ సేవలు అందించాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడా లేనివిధంగా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోజుకు 60 సిజేరియన్లు జరుగుతుంటాయి. సరాసరిన రోజుకు 20 సిజేరియన్లు చేయాల్సి ఉండగా.. ఒక్కో సిజేరియన్‌కు అరగంట వేసుకున్నా పది గంటలు వీటికే వెచ్చించాలి. మిగిలిన కాన్పుల కోసం చేరిన వారిని, రోజువారీ పరీక్షలకు వచ్చేవారిని పరీక్షించడానికి సమయం సరిపోవడంలేదు. రోగుల ఒత్తిడి తట్టుకోలేక ఒక్కోసారి విజయవాడ, కాకినాడలకు సిఫార్సు చేస్తున్న పరిస్థితులుంటున్నాయి. ఇదిలాఉండగా తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెంలలో ఒకే ప్రసూతి నిపుణులు ఉన్నారు. మిగిలిన పాలకొల్లు, కొవ్వూరు, నిడదవోలు ఆసుపత్రుల్లో గైనకాలజిస్టులు లేరు. పైన పేర్కొన్న ఆసుపత్రులన్నింటిలో ఆదివారం అయినా, వైద్యులు సెలవు పెట్టినా సంబంధిత సిజేరియన్‌ కేసులను ఏలూరు ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారు. ఈవిధంగా కూడా ఏలూరు ఆసుపత్రికి తాకిడి పెరిగిపోతోంది. ఏలూరు సహా మిగిలిన అన్ని ఆసుపత్రుల్లో గైనకాలజిస్టుల సంఖ్యను పెంచితే రోగులకు మంచి సేవలు అందించడానికి వీలు కలుగుతుంది.వీరు ఒక ఆసుపత్రిలో కాకుండా జిల్లాలో సేవలు అందాల్సిన ప్రాంతానికి వెళ్లి అక్కడ సేవలందించే విధంగా వీరికి శిక్షణ ఇచ్చి ఇబ్బందులు అధిగమించడానికి ప్రయత్నించాలనేది వీరి ఆలోచన.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8860
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author