తెలుగు రాష్ట్రాలకు ఒకటి…  ఈశాన్య రాష్ట్రాలకు మరొకటా…

తెలుగు రాష్ట్రాలకు ఒకటి…  ఈశాన్య రాష్ట్రాలకు మరొకటా…
November 25 12:20 2017
(విశ్లేషణ)
వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా విస్తట్లోకి అన్ని వస్తాయని…..కేంద్రం తీరు చూస్తోంటే తెలుగు రాష్ట్రాలపై  సవితి ప్రేమ చూపిస్తోందనే సందేహాలు కలగక మానవు…విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తాత్సారం చేస్తోన్నకేంద్రం అదే సమయంలో ఈశాన్య రాష్ట్రమైన  సిక్కిం విషయంలో మాత్రం మరోలా వ్యవహరిస్తోంది.ఏపీలో నియోజక వర్గాల పెంపు…. మూడున్నరేళ్లుగా అటు ఆంధ్రా., ఇటు తెలంగాణలలో అధికార, ప్రతిపక్షాల మధ్య  తీవ్రంగా నలుగుతోన్న రాజకీయ సమస్య. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం  విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ తో పాటు., కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కూడా  అసెంబ్లీ సీట్లను పెంచేందుకు హామీ ఇచ్చింది. దీనిపై రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి.  దాదాపు మూడేళ్ల నుంచి  ఇదే అంశంపై పలుమార్లు ఏపీ సీఎంతో పాటు., తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. మొదట్లో ఇదిగో అదిగో అంటూ  ఊరించి ఆ తర్వాత అబ్బే  కుదరదు., చట్టం ఒప్పుకోదు అంటూ అడ్డం తిరిగారు.భారత రాజ్యాంగం దేశంలోని ఏ రాష్ట్రమైనా సమాఖ్య వ్యవస్థలో సమానమే.  ఆర్టికల్ 2,3,4లోని సదుపాయాలను వినియోగించుకుని కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాలకు కూడా విభజన చట్టం ద్వారా నియోజక వర్గాల పెంపు హామీ లబించింది. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2026 వరకు  నియోజక వర్గాల పునర్విభజనకు అవకాశం లేదని చావు కబురు చల్లగా చెప్పారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఒక్క తాటిపైకి వచ్చిన అంశం ఏదైనా ఉందంటే అది కేవలం అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు మాత్రమే. మొదట్లో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ఫైల్ నోట్ ప్రిపేర్ అవుతోందంటూ ప్రకటనలు సైతం చేశారు. అదే సమయంలో బీజేపీ రాజకీయంగా లబ్ది పొందడానికి అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు ఏ మాత్రం ఉపయోగపడదని తేలిపోవడంతో ఆ అంశం  దారి తప్పడం మొదలైంది.నియోజక వర్గాల పునర్విభజన చేయాలంటే  దేశంలో ఎక్కడైనా ఒకే నిబంధన అమల్లో ఉంటుందని ఇన్నాళ్లు కేంద్రం వాదిస్తూ వస్తోంది. తాజాగా సిక్కిం అసెంబ్లీ స్థానాలను పెంచేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమవుతోంది……  తెలుగు రాష్ట్రాలకు వర్తించే నిబంధనలు  ఈశాన్య రాష్ట్రానికి వర్తించవా….?ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. అన్ని కలిసొస్తే  త్వరలోనే అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయం కానుంది. సిక్కిం రాష్ట్రంలో ప్రస్తుతమున్న 32 స్థానాలను 40కు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది.  భారత భూభాగంలో 1975లో  విలీనమైన తర్వాత సిక్కిం  అసెంబ్లీ స్థానాలను పెంచడం ఇదే తొలిసారి.  సీట్ల పెంపు ద్వారా సిక్కింలో గిరిజనులుగా గుర్తించిన లింబూ., తమాంగ్ కులాలకు రిజర్వేషన్ ద్వారా చట్టసభలలో ప్రవేశం కల్పించడానికి వీలవుతుంది. 2003 నుంచి ఈ రెండు కులాలను ఎస్టీలుగా గుర్తించారు.  త్వరలో పెంచే 8 స్థానాలలో ఐదు స్థానాలను వీరికి కేటాయించాలని కేంద్రం భావిస్తోంది.  ప్రస్తుత సిక్కింలో 12 సీట్లను భూటియా, లెప్చాలకు,  రెండు స్థానాలు ఎస్సీలకు., ఒకటి సంఘాలకు, 17 జనరల్ స్థానాలుగా ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. భూటియా, లెప్చాలు ఎస్టీలు కాకున్నా  1973లో సిక్కిం రాజుతో జరిగిన రాజకీయ ఒప్పందం మేరకు వారికి సీట్లను కేటాయిస్తున్నారు. అయితే తమకు అన్యాయం జరుగుతోందంటూ  లింబూ., తమాంగ్ వర్గీయులు  కొన్నేళ్ళ క్రితం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ  2016 జనవరి నాలుగున హోంశాఖను ఆదేశించింది. అయితే ఆ ప్రతిపాదన కేంద్ర మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్ లో ఉందని., ప్రజా ప్రాతినిద్య చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుందని వివరించారు.  నియోజక వర్గాల పునర్విభజన చట్టం ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో  నియోజక వర్గాలను సవరించాలన్నా 2026 తర్వాతి జనాభా లెక్కల ఆధారంగానే చేయాల్సి ఉంటుందని తేల్చారు.నిజానికి  కేంద్ర డీ లిమిటేషన్ కమిషన్ వెలువరించే తుది తీర్పును ఏ న్యాయస్థానాలు సవాలు చేయడానికి వీల్లేదు. అయితే సిక్కిం విలీన సమయంలో జరిగిన ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా  అక్కడ నియోజక వర్గాల మార్పులు చేయవచ్చని న్యాయశాఖ పేర్కొంది.భూటియా, లెప్చా వర్గాలకు కేటాయిస్తున్న 12 స్థానాలతో పాటు,  సంఘా కమ్యూనిటీకి ఉన్న ఒక్క స్థానానికి ఎలాంటి మార్పు చేయకూడదని, తగ్గించకూడదనే డిమాండ్ ఉంది. 2009లో అసెంబ్లీలో చేసిన తీర్మానంతో తమకు దక్కాల్సిన స్థానాలపై కోత పడుతుందనే భావన భూటియా-లెప్చాలలో ఉంది. సీట్ల పెంపు లేకపోతే తమకు రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందనే ఆందోళన వారిలో ఉంది. దీంతో  లింబూ, తమాంగ్ కులాలకు ఐదు సీట్లకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు భూటియా, లెప్చాలకు, ఎస్సీ, సంఘాలకు రిజర్వేషన్లు కొనసాగించడం ఇతరులకు అదనంగా మూడు స్థానాలు కల్పించాలని నిర్ణయించారు. అన్ని అనుకూలిస్తే త్వరలోనే సిక్కిం అసెంబ్లీ సీట్ల పెంపుకు అమోద ముద్ర పడుతుంది.సిక్కిం పరిస్థితి బాగానే ఉంది., మరీ తెలుగు రాష్ట్రాల మాటేమిటి….దీనికి సమాధానం ఎవరు చెబుతారు….2019లోగా నియోజక వర్గాల పునర్విభజన సాధ్యమేనా…. అందుకు కేంద్రం సహకరిస్తుందా….రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశం కేంద్రం చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. ఏపీలో ప్రస్తుత మున్న 175 అసెంబ్లీ స్థానాలు 225కు పెరగాలన్నా.,  తెలంగాణలో 119 స్థానాలు 153కు చేరాలన్నా., అందుకు  కేంద్ర దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంది.  ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్  26లో పొందుపరిచిన  నియోజక వర్గాల పెంపు అంశాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగానే జటిలం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆర్టికల్ 170 ప్రకారం నియోజక వర్గాల పెంపుకు వీలు కాదని కేంద్రం ఇన్నాళ్లు వాదిస్తూ వస్తోంది.అదే సమయంలో ఆర్టికల్ 2,3,4 ప్రకారం ఏర్పడిన రాష్ట్ర చట్టాన్ని  ఆర్టికల్ 170 ద్వారా ప్రశ్నించే అవకాశం కూడా ఉండదని న్యాయనిపుణులు చెబుతున్నారు.  సిక్కిం విలీనం సందర్భంగా జరిగిన ఒప్పందాల మేరకు అక్కడి అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్లు అమలు చేయగలిగినపుడు చట్టబద్దంగా ఏర్పడిన రాష్ట్రంలో హామీలను ఎందుకు అమలు చేయలేరనే ప్రశ్న కూడా  తలెత్తుతుంది.అసలు కేంద్రం ఎందుకు నియోజక వర్గాల పెంపుకు సుముఖంగా లేదనే సందేహాలు కూడా కలగక మానవు. మొదట్లో  నియోజక వర్గాల పెంపుకు సుముఖంగానే ఉన్నా ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలనున బేరీజు వేసుకోవడం వల్లే  బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందనే అనుమానాలు రెండు రాష్ట్రాల్లో ఉంది. అయితే బీజేపీ  పెద్దలు మాత్రం  దీనిపై ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.  రెండు రాష్ట్రాల డిమాండ్ ను పరిష్కరించే విషయంలో  వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. సిక్కిం అసెంబ్లీ సీట్లను పెంచాలని నిర్ణయించుకున్న సమయంలో తెలుగు రాష్ట్రాల డిమాండ్ కు కూడా సహేతుక సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8868
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author