తెలంగాణలో సై `కిల్ `

తెలంగాణలో సై `కిల్ `
November 25 16:10 2017
హైద్రాబాద్,
గతమెంతో ఘనం….భవిష్యత్ ప్రశ్నార్ధకం ఇది ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి రాష్ట్రం విడిపోయిన అనంతరం జరిగిన ఎన్నికలలో సైతం జిల్లాలో సత్తాచాటిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం కోసం కష్టాలు పడుతుంది. ఉమ్మడి జిల్లాలో వెలుగు వెలిగిన టిడిపి ఇప్పుడు శివారులోని కొన్ని ప్రాంతాలకు పరిమితం అయింది. సీమాంధ్ర ప్రాంత వాసులు నివసించే ప్రాంతాల్లో కొంత మంది నేతలు కనిపిస్తున్న గ్రేటర్ ఫలితాలను లెక్కవేసుకుని సీమాంధ్ర వాసులు సైతం టిడిపిని ఆదరించే పరిస్థితులు లేవని వారు సైతం తమ దారి తాము చూసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.సమైక్య రాష్ట్రంలో జిల్లాలో తిరుగులేని శక్తిగా వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సైతం టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు షాక్ ఇచ్చి మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంతో పాటు రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్.బి.నగర్, శేరిలింగంపల్లి స్థానాలను కైవసం చేసుకుని జిల్లాలో తమకు తిరుగులేదని నిరూపించుకుంది. మారిన రాజకీయ పరిస్థితులలో తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్‌తో టిడిపి జెండాపై విజయం సాధించిన ప్రకాష్‌గౌడ్ (రాజేంద్రనగర్), మంచిరెడ్డి కిషన్ రెడ్డి( ఇబ్రహీం పట్నం), తీగల క్రిష్ణారెడ్డి( మహేశ్వరం), మాధవరం క్రిష్ణారావు( కూకట్ పల్లి), వివేకానంద (కుత్బుల్లాపూర్), అరికేపూడి గాంధీ( శేరిలింగంపల్లి)లతో పాటు మల్కాజ్‌గిరి నుంచి ఎంపిగా విజయం సాధించిన మల్లారెడ్డిలు సైకిల్ వదిలి కారు ఎక్కడంతో జిల్లాలో తెలుగుదేశం కంచుకోటలకు బీటలు వారాయి. ఎమ్మెల్యేలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో జడ్ప్‌టిసి, ఎంపిటిసి, సర్పంచ్‌లతో పాటు పార్టీ శ్రేణులు వలస బాట పట్టాయి. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న కొంత మంది నేతలు పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యే పరిస్థితులను తీసుకువస్తున్నాయి. టిడిపి తరపున ఎల్.బి.నగర్ నుంచి విజయం సాధించిన ఆర్. క్రిష్ణయ్య టిడిపి పార్టీ కన్న బిసి ఉద్యమ నేతగా పోరాటాలు చేస్తున్నారు. ఎంపి దేవేందర్ గౌడ్ ఉన్న అనా రోగ్యం మూలంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితులున్నాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది.
ఎంపి, ఎమ్మెల్యేలు, బడా నేతలు పార్టీ మారిన జిల్లాలోని పలు ప్రాంతాల్లో టిడిపికి పట్టును నిలపెట్టుకుంటూ ముందుకు సాగింది. రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నంత సేపు పార్టీని నమ్ముకున్న చాలా మంది నేతలు ప్రస్తుతం పూర్తిగా డీలాపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా తమకు ప్రాధాన్యం దక్కదని భావిస్తున్న నేతలు, టిడిపిలో చిన్న చితక పదవుల్లో ఉన్న నేతలు మినహ మిగతా నేతలు టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల వైపు జంప్ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనతో పాటు మెజార్టీ నేతలు వలసబాట పట్టారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా టిడిపి అధ్యక్షుడు జంగయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఉదయ్‌మోహన్ రెడ్డిలతో పాటు టిడిపిలోని పలువురు నేతలు రేవంత్‌బాటలోనే కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. నియోజకవర్గాల్లో మిగిలిన నేతలు సైతం చాలా మంది రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉండి డిసెంబర్ 9 తర్వాత రేవంత్ రెడ్డి నియోజకవర్గాల్లో తిరిగే సమయంలో టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. సీనియర్ నేత ఎంపి దేవేందర్ గౌడ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్ గౌడ్‌లు టిడిపిలో ఉన్న ఒక్క నియోజకవర్గానికి పరిమితమయ్యారు. మహేశ్వరంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తప్ప పెద్దగా జనంలోకి వచ్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సామ రంగారెడ్డి ఎల్.బి.నగర్, ఇబ్రహింపట్నం నియోజకవర్గాలకు పరిమితం కాగా రాజేంద్రనగర్, చెవెళ్ళ, శేరిలింగంపల్లి నియోజకవర్గాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సీనియర్ నేతలు సామ భూపాల్ రెడ్డి, బుక్క గోపాల్, గణేష్ గుప్తలు ఉన్న క్యాడర్‌లో జోష్ తీసుకురాలేకపోతున్నారు. చెవెళ్ళలో పార్టీ చుక్కని లేని నావలా తయారైంది. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాలలో దాదాపు ఇదే పరిస్థీతులు ఎర్పడ్డాయి. మేడ్చల్ నియోజకవర్గంలో పట్టున్న ఉన్న ఇటివల జిల్లా అధ్యక్షుడు జంగయ్య యాదవ్ టిడిపి వీడి కాంగ్రెస్‌లో చేరడంతో కథ ముగిసింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్‌గిరిలో జెండా పట్టుకునే క్యాడర్ కొంత వరకు ఉన్న నడిపించే లీడర్‌లేక క్యాడర్ తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇబ్రహింపట్నంలో క్రింది స్థాయి నేతలు పోరాటం చేస్తున్న పార్టీ పెద్దల నుంచి సహకారం లేక నారాజ్‌లో ఉన్నారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్ యాదవ్ కొనసాగుతున్న కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూర్‌లో పార్టీ పరిస్థీతి దారుణంగా మారింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=8918
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author