గ్రామాల్లో కానరాని స్వచ్ఛ భారత్ 

 గ్రామాల్లో కానరాని స్వచ్ఛ భారత్ 
November 28 01:45 2017
నల్లగొండ,
 ప్రతి గ్రామాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో డంపింగ్‌ యార్డుల నిర్మాణాలకు పూనుకుంది. పూర్వ నల్గొండ జిల్లాలో పలు కారణాల సాకుతో డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనులు నెమ్మదిగా నడుస్తుండగా.. మరో పక్క నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న వాటిల్లో చెత్తను వేయాలనే ధ్యాస పంచాయతీ సిబ్బందికి కొరవడటంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌లో భాగంగా పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
ఈ క్రమంలో చేపడుతున్న పనులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగినన్ని నిధులు కూడా అందిస్తుండటం తెలిసిందే. పూర్వ నల్గొండ జిల్లాలో మొత్తం 1184 డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు అధికారులు లక్ష్యం చేసుకోగా అందులో కేవలం 234 మాత్రమే పూర్తయ్యాయి. మరో 534 వివిధ దశల్లో ఉన్నాయి. 416 డంపింగ్‌ యార్డులను పలు సమస్యల కారణంగా ప్రారంభించక పోవడం గమనార్హం. ఇప్పటివరకు వీటినిర్మాణాల పరంగా కూలీలకు చెల్లించిన మొత్తం రూ.5.60 కోట్లు. గ్రామస్థాయిలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కలిగించకపోవడంతో నిర్మాణం పూర్తికాక కొన్ని, నిరుపయోగంగా మరికొన్ని దర్శనమిస్తున్నాయి. రూ.కోట్లు వెచ్చించి చేపడుతున్న వీటి నిర్మాణాల లక్ష్యంపై అన్ని వర్గాల్లో చిత్తశుద్ధి కొరవడింది.
డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి అనువైన స్థలం కొరత కారణంగా కొంతమేర ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామంలోని స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించి ఈజీఎస్‌ సిబ్బందికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే అధికారుల మధ్య సమన్వయం లోపంతో స్థలం గుర్తింపే కష్టంగా మారుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక స్థలాలు గుర్తించిన చోట మరో అవస్థ ఎదురవుతోంది. వ్యవసాయ సీజన్‌ కావడంతో తగినంత మంది ఉపాధికూలీలు లేకపోవడంతో పనులు సాగడంలేదు. అధికారులు చొరవ తీసుకుని ప్రయత్నిస్తే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.
ఎవరికీ ఇబ్బంది కలిగించని ప్రాంతాలను ఎంపికచేసి డంపింగ్‌యార్డులను ఉపాధిహామీ కూలీలతో నిర్మించినా ఫలితం ఉండటంలేదు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రామశివారుల్లోనూ, నివేశన స్థలాల మధ్యన చెత్త వ్యర్థాలను పారబోస్తున్నారు. ఈ విషయాన్ని ఆయా గ్రామ సభల్లో స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండటంలేదు. కొన్ని గ్రామాలకు ట్రాక్టర్‌ వాహనాలు లేకపోవడం, ఉన్న సైకిల్‌ రిక్షాలతో చెత్తవ్యర్థాలను తీసుకెళ్లి పారబోయాలనే ధ్యాస లేకపోవడం వల్ల నిర్మించినా ఇబ్బందులు తప్పడంలేదు. నిర్మాణాలను పూర్తిచేసిన కొన్ని ప్రాంతాల్లో పరిసర వాసుల అభ్యంతరాల వల్ల అవి నిరుపయోగంగానే ఉన్నాయి. ఫలితంగా రూ.కోట్ల ధనం దుర్వినియోగమవుతున్నాయని పలువురు అంటున్నారు. అధికారులు చొరవచూపి చెత్తడంపింగ్‌ యార్డుల్లోనే వ్యర్థాలను పారబోసేలా సిబ్బందికి అవగాహన కల్పించాలని అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9145
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author