హడలెత్తిస్తున్న దోమలు 

హడలెత్తిస్తున్న దోమలు 
November 28 10:55 2017
కాకినాడ,
 కార్పొరేషన్ లో కొత్త పాలక వర్గం వచ్చినా కాకినాడ ప్రజల సమస్యలు తీరడం లేదు. కొత్త పాలకవర్గం నుంచి ప్రజలు ఎంతో ఆశించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ నగరంలోని మురికివాడల్లో అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేదలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడికక్కడ మురుగు నీరు పొంగిపొర్లే డ్రైన్లు… దుర్గందభరితమైన వాతావరణం మధ్యనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు.
పగలు, రాత్రీ తేడా లేకుండా ముసురుకొనే దోమలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా మురికివాడల్లోని పిల్లలు దోమకాట్లకు బలవుతున్నారు. కాకినాడ నగర పరిధిలోని ప్రధాన మురికివాడలైన డైరీఫామ్‌ సెంటర్‌, గొడారిగుంట, దుమ్ములపేట, సంజయ్‌నగర్‌, పర్లోపేట, రెవెన్యూ కాలనీ, ఏటిమొగ, బాపూజీనగర్‌ ఇలా మొత్తం మీద 101 మురికి వాడలున్నాయి. ఈ ప్రాంతాల్లో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో పేదలు నానా అవస్థలు పడుతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైన్ల వలన మురుగునీరు కాలనీల మధ్యనే ఉండిపోతోంది. జయరాంపేట వంటిచోట్ల మురుగు ఇళ్ల మధ్యనే ఉండటంతో దోమల బెడద అధికంగా ఉంది.
సంజయ్‌నగర్‌, దుమ్ములపేట కాలనీల్లో ఇళ్ల మధ్యనే తటాకాలను తలపించేలా మురుగునీటి గుంటలున్నాయి. వీటిలో పెరుగుతున్న దోమల కారణంగా అక్కడి చిన్నారులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. జ్వరాలు, మలేరియా, చర్మవ్యాధులతో సతమతమవుతున్నారు. దుమ్ములపేట కాలనీలో పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో ప్రతి పదిమందిలో ఏడు మందికి చర్మవ్యాధుల సమస్య ఉంది. ఈ ప్రాంతంలో తల్లిదండ్రులకు వారి పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.
మురికివాడల్లో ఉంటున్న చిన్నారులకు దోమల వలన ఒళ్లంతా దద్దుర్లుతో నిండిపోయాయి. ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఈ కాలనీలను ఆనుకొనే డంపింగ్‌ యార్డు ఉండటం, మురుగు నీటి ప్రవాహం లేకపోవడంతో దోమల సమస్య విపరీతంగా ఉంది. దోమల నియంత్రణ కోసం ఏటా నగరపాలక సంస్థ రూ.లక్షల్లో ఖర్చు చేస్తోంది. మురికివాడల్లో పరిస్థితి మారడం లేదు.
కాకినాడ నగరంలో 12, 13, 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పారిశుద్ధ్యం మెరుగుకు ఏటా రూ. 25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. వీటితోపాటు డ్రైన్ల నిర్మాణానికి భారీగానే వెచ్చిస్తున్నారు. 2015, 2016, 2017 సంవత్సరాల్లో డ్రైన్ల నిర్మాణానికి నగరపాలక సంస్థ నుంచి రూ. 20 కోట్ల మేర ఖర్చు చేశారు. 24 కిలోమీటర్ల మేర అదనంగా డ్రైన్లను నిర్మించారు. ఇంత చేసినా దుమ్ములపేట, సంజయ్‌నగర్‌ వంటి మురికివాడల్లో ఎలాంటి మార్పు లేదు. ఎక్కడ మురుగు అక్కడే తిష్ఠ వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో 14 పారిశుద్ధ్య సర్కిళ్ల పరిధిలో 13 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, 26 మంది మేస్త్రీల పర్యవేక్షణలో 846 మంది శాశ్వత, కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. ఇంత చేస్తున్నా.. పారిశుద్ధ్య పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో దోమల నివారణ చర్యలు చేపడుతున్నా… మురికివాడల్లో అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9161
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author