లంచమిస్తేనే వైద్యం 

లంచమిస్తేనే వైద్యం 
November 28 10:59 2017
అనంతపురం,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అన్ని వైద్య సేవలు ఉచితమే. శస్త్ర చికిత్సలూ చేయాల్సిందే.  కానీ ఆర్థో విభాగంలో కొందరు వైద్యులు ఉచితం తమకు వర్తించదంటూ ముడుపుల బాగోతానికి తెరతీశారు. కాసులకు కక్కుర్తిపడి తెరచాటు సంపాదనకు ఒడిగడుతున్నారు. ఆస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలేనన్న విషయం తెలిసినా.. సొమ్ము ముట్టజెప్పందే శస్త్ర చికిత్సకు కత్తి పట్టుకోని దైన్య దుస్థితి నెలకొంది. ప్రైవేట్‌ క్లినిక్‌ల్లో రేట్లను కుదుర్చుకునే వైద్యులు కొందరైతే.. ఆస్పత్రికి వచ్చిన తర్వాత దళారుల మాటున ధరలను నిర్ణయించుకునే వైద్యులు మరికొందరు ఉన్నారు.
ఏదొక రూపంలో రోగులను పిండేస్తున్నారు. లేదంటే హైరిస్క్‌ పేరుతో నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తున్నారు. గట్టిగా మాట్లాడితే చీదరించుకుని తూతూమంత్రంగా సేవలు అందిస్తున్నారు. నిస్సహాయ స్థితిలో రోగులు సర్దుకుని పోతున్నారు. బయటకు పొక్కితే వైద్య చికిత్స చేయరన్న భయంతో గుట్టు విప్పడం లేదు. ఈ అవినీతి తతంగం ఇటీవల పెచ్చుమీరింది. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు.
సర్వజన ఆస్పత్రిలో ఆర్థో విభాగానికి ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ ఉంది. అందుకే రోజూ శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. ఇక్కడి వైద్యులు రెండు యూనిట్లుగా సేవలు అందిస్తున్నారు. అయితే ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓపీకి ఎప్పుడొస్తారో.. ఐపీ రోగులను ఎప్పుడు పరీక్షిస్తారో కూడా తెలియని పరిస్థితి. అందుకే ఇక్కడి వైద్యులు చాలామంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో పలువురు ప్రైవేటు క్లీనిక్‌లను నడుపుతున్నారు. రోగులు ప్రైవేట్‌ క్లినిక్‌లకు వెళ్లగానే శస్త్ర చికిత్స చేయాలంటారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అయితే ఎక్కువైతుంది.. ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేస్తాం. సగం ధరకే పూర్తి చేస్తామంటూ చెబుతున్నారు. ఉదాహరణకు రూ.50 వేలు ఖర్చయితే.. రూ.25 వేలకే శస్త్రచికిత్స చేస్తామంటారు. సగం డబ్బు తగ్గుతుందన్న ఆశతో రోగులు కూడా వెంటనే ఒప్పేసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు సర్వజనాస్పత్రిలో నిత్యకృత్యంగా మారాయి. రోజూ ఐదు నుంచి పది మందికి ఆపరేషన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థో విభాగంలో పనిచేస్తున్న వైద్యుల్లో ఆరుగురిపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. వీరంతా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేతులు, కాళ్లు, మక్కి, నడుం, భుజాలు.. ఇలా పలు శరీర విభాగాలు ఫ్రాక్చర్‌ అయితే అంతే. ఒక్కో దానికి ఓ రేటు నిర్ణయించి దందాకు పాల్పడుతున్నారు. వీరిలో ఓ డాక్టర్ స్పెషల్ ఫీజు పేరుతో అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరో డాక్ట్ శస్త్రచికిత్సలు చేస్తానంటూ జాబితాలోకి ఎక్కిస్తారు. ఓ పది కేసులు ఉంటే.. ఒకటో రెండో చేసి.. మిగతావి వాయిదా వేస్తారు. అదే ముడుపులు ఇచ్చి ఉంటే ఒకేరోజు అన్నీ పూర్తి చేస్తారు. ఇంకో డాక్టర్ అయితే ఉదయం అలా వస్తారు… ఇలా వెళ్లిపోతారు. ఆస్పత్రికి వచ్చిన కేసులను బయటకు తీసుకెళతారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ కేసుల్లోనూ దందా సాగిస్తున్నారు. ట్రస్టు ఆమోదం తెలిపిన కేసులను సైతం జాప్యం చేస్తున్నారు. ఓ ఇద్దరు డాక్టర్లు ఇన్‌స్ట్రుమెంట్‌ పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు మిన్నకుండిపోయారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9164
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author