పట్టణవాసులకు ఆనందకర జీవనం అందించండి…

పట్టణవాసులకు ఆనందకర జీవనం అందించండి…
November 29 19:27 2017
అమరావతి,
మున్సిపాల్టీల్లో మెరుగైన మౌలిక సదుపాయలు కల్పించి, పట్టణ వాసులకు ఆనందకర జీవనం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో పురపాలక సంఘాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణాల్లో అమలు చేస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పీఎంఎవై కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతి, మాతృత్వ, శిశు మరణాల తగ్గుదలకు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టులు త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ పగడ్బందీగా చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాల్లో ఉన్న మోడల్ అంగన్వాడీ కేంద్రాలతో పాటు పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయలు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులపై చదువు కోసం ఒత్తిడి తెచ్చేలా చేయొద్దన్నారు. విద్యను ఆస్వాదించేలా విద్యార్థులను ప్రోత్సాహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులకు ఆటపాటలతో విద్యనభ్యసించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విజ్ఞానం పెంపొందించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు తరుచూ నిర్వహించాలన్నారు. తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్న విద్యార్థుల్లో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తున్నాయన్నారు. ఇప్పుడు దేశంలో ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారిలో అధిక శాతం మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చినవారేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. పట్టణాల్లో పచ్చదనం మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలను సీఎం దినేష్ కుమార్ అడిగి తెలుకున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వమిచ్చిన లక్ష్యంలో 65 శాతం మేర పట్టణాల్లో పచ్చదనం మెరుగుపర్చామని అధికారులు తెలిపారు. 90 శాతం మేర పురపాలక సంఘాల్లో పచ్చదనం మెరుగుపర్చాలని సీఎస్ ఆదేశించారు. పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిని సీఎస్ దినేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. అపార్టుమెంట్లుగా ఫేజ్-1 కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను 2018  అక్టోబర్ నాటికి, ఫేజ్-2 నిర్మాణాలను 2019 మార్చి నాటికి పూర్తి చేస్తామని సీఎస్ కు అధికారులు తెలిపారు. ఈ నిర్మాణాల్లో నాణ్యతను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు. మున్సిపాల్టీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు వంద శాతం ఎల్ఈడీ వీధి బల్బులను అమర్చాలని స్పష్టం చేశారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే విద్యుత్ శాఖాధికారులు స్పందించి, వీధి లైట్లను మరమ్మతులు చేయాలన్నారు. మున్సిపాల్టీల్లో రాత్రిళ్లు వీధి లైట్లు వెలగకుండా, చీకట్లు అలుముకునే పరిస్థితి తలెత్తితే కఠినంగా వ్యవహరిస్తానని సీఎస్ హెచ్చరించారు. పట్టణ పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు తీసుకుంటున్న చర్యల గురించి మెప్మా అధికారులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. దారిద్ర్య రేఖ దిగువున్న కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకువాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి పథకాల ప్రగతి గురించి సీఎస్ కు అధికారులు వివరించారు. తాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలన్నారు. మున్సిపాల్టీల్లో మెరుగైన మౌలిక సదుపాయలు కల్పిస్తూ, ప్రజలకు ఆనందకర జీవనం అందించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కన్నబాబుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9461
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author