సాగని కొనుగోళ్లు 

సాగని కొనుగోళ్లు 
November 30 20:40 2017
హైదరాబాద్,
నవంబరు, డిసెంబరు నెలల్లో మార్కెట్లకు పత్తి పంట వెల్లువలా వచ్చేది.. కానీ కొన్ని రోజులుగా వ్యవసాయ మార్కెట్లు, జిన్నింగ్‌ మిల్లులకు పత్తి రాక తగ్గిపోయింది. ఇప్పటి వరకూ 24 గంటలు నడిచిన జిన్నింగ్‌ మిల్లులు.. సరిపడా పత్తి లేక ప్రస్తుతం 12 నుంచి 15 గంటలు మాత్రమే నడుస్తున్నాయి. రాష్ట్రంలో పెరిగిన పత్తి విస్తీర్ణం, ఉత్పాదకతల ఆధారంగా ఈ ఏడాది 33.25 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే రాష్ట్రంలో శనివారం నాటికి సీసీఐ, ప్రైవేటు వ్యాపారులు కలిసి కొనుగోలు చేసింది కేవలం 4.86 లక్షల టన్నులు మాత్రమే.
దీన్ని బట్టి ప్రభుత్వ అంచనాలో 15 శాతం మేరకు కూడా కొనుగోళ్లు జరగలేదని స్పష్టమవుతోంది. ఇందులో ప్రైవేట్‌ వ్యాపారులు 3.79 లక్షల టన్నులు, సీసీఐ ద్వారా 1.07 లక్షల టన్నుల కొనుగోళ్లు జరిగాయి. మొత్తం కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారుల వాటానే సుమారు 78 శాతంగా ఉంది. అయితే ప్రైవేట్‌ వ్యాపారులు మెజార్టీ పత్తిని మద్దతు కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పత్తి మార్కెట్లలో ఒకటైన వరంగల్‌ మార్కెట్‌కు ఏటా ఈ సమయంలో 50 నుంచి 60 వేల బస్తాల వరకు రైతులు అమ్మకానికి తీసుకువచ్చేవారు. కానీ, ప్రస్తుతం 15 వేల నుంచి 20 వేల వరకు మాత్రమే బస్తాలు వస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధానంగా పింక్‌ బోల్‌వార్మ్‌(గులాబీరంగు పురుగు), జీఎస్టీ ప్రభావమేనన్న అభిప్రాయాలు మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో పత్తి దిగుబడిపై గులాబీ రంగు పురుగు ప్రభావం తీవ్రంగా చూపింది. ఈ పురుగు ఆశించిన చోట దిగుబడి సగానికి పడిపోయిందని రైతులు చెబుతున్నారు. జయశంకర్‌ వర్సిటీ నివేదిక ప్రకారమే వరంగల్‌, జనగామ, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, గద్వాల తదితర ప్రాంతాల్లో గులాబీ రంగు పురుగు ఉధృతి ఉన్నట్లు తేలింది. ఎక్కువ శాతం పత్తి వచ్చేది రెండు, మూడో పికింగ్‌లలోనే. ప్రస్తుతం రెండో పికింగ్‌ పూర్తయి.. మూడో పికింగ్‌ కూడా చాలా చోట్ల జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో పత్తి అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం.. గులాబీ పురుగు ప్రభావంతో దిగుబడులు గణనీయంగా తగ్గడమేనని చెబుతున్నారు. అయితే, రైతులు నాణ్యత లేని పత్తిని అమ్ముతూ.. నాణ్యమైన పత్తిని ధర కోసం ఇళ్లలో నిల్వ ఉంచుతున్నారని, అందుకే మార్కెట్‌కు పత్తి అరైవల్స్‌ తగ్గిపోయాయని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జిన్నింగ్‌ మిల్లులు, మార్కెట్లకు పత్తి అరైవల్స్‌ తగ్గిపోయినా.. డిమాండ్‌ పెరగకపోవడంపై మార్కెటింగ్‌ శాఖ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పత్తి పంటకు డిమాండ్‌ రాకపోవడానికి నాణ్యత తగ్గడం ఒక కారణమైతే.. జీఎస్టీ విధానం మరో కారణమని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
పత్తి కొనుగోళ్లపై రివర్స్‌ చార్జి మెకానిజం పద్ధతిలో కేంద్రం జీఎస్టీ అమలు చేస్తోంది. ఈ విధానంలో రైతు నుంచి కొనుగోలు చేసిన పత్తికి వ్యాపారి/జిన్నింగ్‌మిల్లు యజమాని 4 శాతం జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారి/జిన్నింగ్‌మిల్లు నుంచి పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారి.. ఆ పత్తిని ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లయితే.. ఒక శాతం పన్నును ఆ వ్యాపారి.. రైతు నుంచి కొనుగోలు చేసిన వ్యాపారికి రీయింబర్స్‌ చేస్తాడు. దేశీయంగా వినియోగిస్తే పూర్తి పన్నును భరించి.. 4 శాతం పన్నును రీయింబర్స్‌ చేస్తాడు. ఈ క్రమంలో పన్ను రీయింబర్స్‌కు నాలుగు నెలల వరకూ సమయం పడుతోంది. ఈ పద్ధతి భారంగా మారడంతో పలు రాష్ట్రాల్లో పత్తి కొనుగోళ్లను వ్యాపారులు తగ్గించేసినట్లు తెలుస్తోంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9708
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author