ఉమా ఊగిసలాట

ఉమా ఊగిసలాట
December 01 14:14 2017
నల్గొండ,
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, తనయుడు యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరే విషయమై సీఎం కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. టీడీపీతో తన భర్త దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి హయాం నుండి ఉన్న 33ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఉమా,సందీప్‌లను టీఆర్‌ఎస్‌లోకి చేర్పించే బాధ్యతను సీఎం కేసీఆర్ జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డికి అప్పగించారు. కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి ఉమామాధవరెడ్డిని ఆహ్వానిస్తు రాజకీయ మంతనాలు జరిపారు. తదుపరి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో సైతం జగదీష్‌రెడ్డి చర్చలు జరిపారు. ఉమా చేరికను వారు అభ్యంతరపెట్టవద్దని సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఉమా, సందీప్‌లను టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఆయన వారికి స్పష్టం చేశారు. ఈ చర్చల పిదప ఉమా, సందీప్‌రెడ్డిలు ఈ నెల 29న టీఆర్‌ఎస్‌లో చేరాలనుకున్నారు. అంతకుముందుగా భువనగిరి అసెంబ్లీ స్థానం టికెట్ విషయంతో పాటు తమ రాజకీయ భవిష్యత్‌పై స్పష్టమైన హామీలు పొందే విషయంలో స్వయంగా సీఎం కేసీఆర్‌తో ఉమామాధవరెడ్డి భేటీ కావాలని భావించారు. అయితే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు నేపధ్యంలో సీఎం కేసీఆర్ తీరిక లేకుండా ఉండటంతో కేసిఆర్‌తో భేటికి ఉమమాధవరెడ్డికి అవకాశం లభించకపోవడంతో టీఆర్‌ఎస్‌లోకి ఉమా, సందీప్‌ల చేరిక వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. తన భర్త మాధవరెడ్డి హయాం నుండి తమ కుటుంబంతో సీఎం కేసీఆర్‌కు మంచి పరిచయాలు ఉన్నందునా తాము టీఆర్‌ఎస్‌లో చేరితే తగిన గుర్తింపునిస్తారని ఉమా, సందీప్‌లు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ నుండి తమ రాజకీయ భవిష్యత్‌పై స్పష్టమైన హామీ వచ్చిన వెంటనే కారేక్కేందుకు ఉమా, సందీప్‌లు సిద్ధంగా ఉన్నారు. పార్టీ మార్పుపై అమెరికా నుండి రేపు సందీప్‌రెడ్డి తిరిగి రాగానే కీలక నిర్ణయం తీసుకోవాలని ఉమా యోచిస్తున్నారు.మరోవైపు టీఆర్‌ఎస్ నుండి భువనగిరి అసెంబ్లీ స్థానం టికెట్ విషయమై స్పష్టమైన హామీ దక్కని పక్షంలో ఉమామాధవరెడ్డి కారేక్కే విషయంలో వెనుకడుగు వేయవచ్చన్న ప్రచారం సైతం అనుచర వర్గాల్లో సాగుతుంది. భువనగిరి నుండి టికెట్ విషయమై కాంగ్రెస్ నుండి స్పష్టమైన హామీ ఇస్తే ఆ పార్టీ వైపు కూడా ఉమా అడుగులు వేయవచ్చని ఏది ఏమైనా ఉమా పార్టీ మార్పుపై రేపోమాపో స్పష్టత వస్తుందని ఉమా వర్గీయులు చెబుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9814
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author