యోధ జె ఈశ్వరీ బాయి

యోధ జె ఈశ్వరీ బాయి
December 01 19:17 2017

యోధ జె ఈశ్వరీ బాయి : చట్టసభల్లోకి దళిత స్త్రీలు రావడమే అరుదు. రిజర్వుడ్ సీట్లలో వచ్చిన దళిత స్త్రీలు అక్కడ వుండే పెత్తందారీ కులాల సభ్యుల ముందు దాదాపు చేతులు కట్టుకుని వున్నట్టే కనిపిస్తారు. వారు నోరు తెరిచి తమ వర్గాల సమస్యల మీద మాట్లాడిన సంద్భాలను మన చెవులతో వినము. వొకవేళ మాట్లాడితే తమ  ప్రత్యర్ధి పార్టీ స్త్రీలలో నోరుగల్ల ఆడవాళ్ళను కట్టడి చెయ్యడానికి పార్టీలో పెత్తందారీ కులాల పురుషుల ఆజ్ఞ మేరకు వారు పలకమన్న వే చిలకలా  పలుకుతారు.  లేకపోతే పట్టు చీర నలిగి పోకుండా జాగర్త గా కూర్చుని మొబైల్ లో గేంస్ ఆడుకోవడం లాంటివి  చేస్తారు చాలామంది దళిత మహిళా నాయకురాళ్ళు. నిజానికి వాళ్ళని ‘ నాయకురాళ్ళు’ అనడం సరి కాదు. అదోరకం సేవక వృత్తి. యిది యిప్పటి దళిత రాజకీయ నాయకురాళ్ళ పరిస్తితి. యిక గ్రామాలలో దళిత మహిళా సర్పంచిలది మరో దీన గాధ. పై కులాల మహిళా సర్పంచ్ ల తరపున వాళ్ళ భర్తలు అధికారాన్ని చెలాయిస్తే దళిత స్త్రీల విషయంలో వారిబదులు గ్రామాలలో పెత్తందారీ పురుషులు వీరి స్థానంలో అధికారాన్ని పొందుతూ ఆ స్త్రీలను రబ్బర్ స్టాంపులు గా వుపయోగిస్తున్నారు. తన పదవీ కాలంలో  వొక్క సారి కూడా కుర్చీలో కూర్చోని దళిత మహిళా సర్పచ్ లు యిప్పుడు వున్నారంటే దళిత మహిళా సాధికారత అనేది యెంత దూరంలో వుందో అర్ధమవుతుంది.

 

యిదే  కులంలో పుట్టి అంబేడ్కర్ స్తాపించిన షెడ్యూల్ కేష్ట్ ఫెడరేషన్(రిపబ్లికన్ పార్టీ ఆఫ్ యిండియా) లో చేరి ఆ పార్టీ కి తద్వారా అంబేడ్కర్ వాదానికి వన్నె తెచ్చిన జె. ఈశ్వరీ బాయి అనే వుక్కు మహిళ చాలా విశిష్టమైన స్వతంత్ర వ్యక్తిత్వంతో చరిత్రకెక్కింది. ఈశ్వరీ బాయి కొన్నాళ్ళు వుపాధ్యాయురాలిగా పనిచేశాక అంబేడ్కర్ స్పూర్తితో రాజకీయాలలోకి వచ్చి మొదట సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కి కౌన్సిలర్ గా యెన్నికై, తర్వాత దళిత సమస్యల పరిష్కారానికి అనేక సంస్థలను స్థాపించించింది. 1958 లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లో చేరి దానికి జనరల్  సెక్రెటరీగా, అధ్యక్షురాలిగా కూడా యెన్నికై సమర్ధవంతంగా పార్టీని నడిపించి యెల్లారెడ్డిగూడ నుంచి 1967 లో అసెంబ్లీకి యెన్నికైంది. ఆమె అసెంబ్లీ సభ్యురాలిగా వున్న సమయంలోనే కృష్ణా  జిల్లా  కంచికచర్ల గ్రామంలో కోటేసు అనే దళిత యువకుడిని అక్కడి పెత్తందార్లు యిత్తడి చెంబు దొంగతనం చేశాడనే నెపంతో సజీవ దహనం చేసిన సంఘటన జరిగింది.  దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన యీ సంఘటనను B.B.C కూడా ముఖ్య వార్తగా ప్రచురించింది. ఈశ్వరీ బాయి కంచికచర్ల కోటేసు వుదంతంపై  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో చర్చ  లేవనెత్తినప్పుడు ‘పెద్దా రెడ్డి’  అనే సభ్యుడు ఆ సంఘటనని తేలికగా తీసిపారేసి ‘యిత్తడి  చెంబు దొంగిలిస్తే మరి చంపరా?’ అని చులకనగా మట్లాడాడు. ఈశ్వరీబాయి ఆ సభ్యుడిపై ఆగ్రహంతో  తన కాలి చెప్పు విసిరి ఆనాటి సభను  వులికిపాటుకు గురి చేసింది. ఆమె యీ సాహసం చేసి దళిత ఆత్మ గౌరవాన్ని 60 వ దశకంలోనే ప్రపంచానికి చాటి నిజమైన అంబేడ్కర్ వారసురాలనిపించుకుంది.

 

ఈశ్వరీ బాయి సట్ట సభల్లో దళిత వాణిని బలంగా వినిపించడమే కాకుండా దళితుల పరంగా, దళిత పేదస్త్రీల పరంగా యెన్నో సేవా కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణా రాజకీయాలలో క్రియా శీలకంగా వుంటూ మంత్రిగా పనిచేసిన జె. గీతారెడ్డి ఈశ్వరీ బాయి కుమార్తె. ఆమె పేరున హైదరాబాద్ చిలకలగూడలో పేద దళిత బాలిక కోసం ‘గీతా విద్యాలయం’ అనే పేరుతో వొక పాఠశాలను స్థాపించి బాలికలకు విద్యతో పాటు స్త్రీలకు టైలరింగ్, పెయింటింగ్, చేతిపనులు నేర్పించడానికి వర్క్ షాపులను యేర్పాటు చేసింది. ‘తెలంగాణా  ప్రజా సమితి’, ‘సివిక్ రైట్ కమిటీ’ అనే సంస్థలను స్థాపించి దళితుల్లో వారి హక్కుల చైతన్యాన్ని పెంపొందించింది. ఆమె స్త్రీ శిశు  సంక్షేమ సంఘానికి అధ్యక్షురాలిగా కూడా యెంతో క్రియాశీలకంగా పని చేసి పేద స్త్రీల అభ్యున్నతి  కోసం కృషి చేసింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో సభ్యురాలిగా వున్నప్పుడు ఆడ పిల్లలకు యెనిమిదవ తరగతి వరకు నిర్బంధ వుచిత విద్య అందించడానికి  ప్రభుత్వం చట్టం తెచ్చేవిధంగా కృషి చేసింది. ఈశ్వరీ బాయి 1969 లో ప్రత్యేక తెలంగాణా కోసం వుద్యమంలో పనిచేసి అరెస్టై జైలుకెళ్ళింది.

 

ఈశ్వరీ బాయి స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు, తెగువ వున్న తొలితరం అంబేడ్కర్ వాది.  యీనాటికీ కులతత్వం, పితృస్వామిక భావ జాలం తాలూకు మొరటుదనం బాహాటకంగానే ప్రదర్శించే చట్టసభల్లో వొక దళిత స్త్రీ అంత ధైర్యంగా, స్వతంత్రంగా వ్యవహరించడం యెంతో  ఆశ్చర్యం కలిగించే అంశం. అంబేడ్కర్ ఆలోచనలను పుణికి పుచ్చుకోవడం వలననే ఈశ్వరీ బాయికి అది సాధ్యపడిండని చెప్పొచ్చు.  ఈశ్వరీ బాయి దళిత స్త్రీ చైతన్య స్పూర్తి

(On  Eswaribai’s Birth anniversary)

(By Dr. Swaroopa Rani)

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=9933
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author